
న్యూయార్క్: టెన్నిస్‌లో ‘సోలో’ స్టార్స్ కాస్త ఇకపై ‘మిక్స్‌డ్’ చాంపియన్స్ కాబోతున్నారు. సింగిల్స్ టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డే పురుషుల, మహిళల సింగిల్స్ సీడెడ్లు ఇకపై జోడీగా స్ట్రాంగ్... డబుల్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌కు ‘సై’ అంటున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ ఆర్గనైజర్లు గ్రాండ్‌స్లామ్‌లో సరికొత్త శోభను తీసుకొస్తున్నారు.
‘మిక్స్‌డ్ డబుల్స్’కు సింగిల్స్ స్టార్‌లతో మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 24న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మొదలుకానుండగా... మిక్స్‌డ్ డబుల్స్ పోటీలు మాత్రం మంగళవారం ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల్లోనే మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌ను నిర్వాహకులు ముగించనున్నారు.
ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ప్రపంచ సింగిల్స్ స్టార్లంతా ఇప్పుడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కోసం కూడా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు జోడీలను ఎంపిక చేశారు. అల్‌కరాజ్, సినెర్, స్వియాటెక్, మాడిసన్ కీస్‌లు ‘మిక్స్‌డ్ డబుల్స్’ దశను మార్చే ఆట ఆడతారా లేదో కొన్ని రోజుల్లోనే తేలనుంది.
‘మిలియన్’ మార్పు
గతేడాది యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను సారా ఎరాని–వావసొరి (ఇటలీ) జోడీ గెలుచుకుంది. వీరిద్దరు ట్రోఫీతో పాటు 2 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 75 లక్షలు)ను పంచుకున్నారు. కానీ ఇప్పుడు మిక్స్‌డ్ ప్రైజ్‌మనీ ఏకంగా 10 లక్షల డాలర్లకు (రూ. 8 కోట్ల 73 లక్షలు) చేరింది. ఐదు రెట్లకు పెరిగిన మొత్తం సింగిల్స్ స్టార్లకు వరమైతే... స్పెషలిస్టు డబుల్స్ ప్లేయర్లకు గుండెకోతను మిగిల్చనుంది.
ఒక్క ప్రైజ్‌మనే కాదు... ఆట కూడా మారింది. 6 గేమ్‌ల స్థానంలో 4 గేమ్‌లతో ఆడిస్తారు. అంటే 6–0, 6–1 స్కోర్లు కాస్తా 4–0, 4–1గా ఉంటాయి. 32 జోడీలకు బదులుగా 16 జోడీలనే బరిలో దించుతారు. అంటే ప్రిక్వార్టర్స్ నుంచే మిక్స్‌డ్ పోరు మొదలవుతుంది. ఒక్క మ్యాచ్ గెలవగానే ఆ జోడీ క్వార్టర్స్ చేరుతుంది. మ్యాచ్‌లు కూడా ప్రధాన వేదికల్లో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు.
జోడీ కట్టించారిలా...
స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ సరికొత్త సమరాన్ని ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో కలిసి ప్రారంభిస్తాడు. ఇటలీ సంచలనం యానిక్ సినెర్ (ఇటలీ)... కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో జోడీ కట్టాడు. షెడ్యూల్ ప్రకారం ఎమ్మా నవారో (అమెరికా)తో సినెర్ ఆడాల్సి ఉండగా... ఆమె తప్పుకోవడంతో చెక్ స్టార్‌ను జతచేశారు.
సెర్బియా దిగ్గజం జొకోవిచ్ తన దేశానికే చెందిన డానిలోవిక్‌తో మిక్స్‌డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే), మాడీసన్ కీస్–టియాఫె (అమెరికా), నయోమి ఒసాకా (జపాన్)–మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్), జ్వెరెవ్ (జర్మనీ)–బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), రుబ్లెవ్ (రష్యా)– కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్), రీలి ఒపెల్కా–వీనస్ విలియమ్స్ (అమెరికా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)– రిబాకినా (కజకిస్తాన్) తదితర హేమాహేమీ జోడీలు ఈసారి కొత్తగా మిక్స్‌డ్ డబుల్స్ బరిలో ఉన్నారు.
మరి మా సంగతేం కాను?
పాత ఒక రోత... కొత్త ఒక వింత.. తాజాగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కొత్త మిక్సింగ్‌పై అసలు సిసలైన డబుల్స్ ఆటగాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటీపీ, డబ్ల్యూటీఏలతో పాటు వందకు పైగా టోర్నీలు జరుగుతున్నాయి.
మిక్స్‌డ్ డబుల్స్ మాత్రం కేవలం నాలుగే నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నిర్వహిస్తారు. ఇందులోనే పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ ఆడే ప్లేయర్లు అదనంగా మిక్స్‌డ్ జోడీ కడతారు.
సాధారణంగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రైజ్‌మనీ కూడా ఎక్కువ. తొలిరౌండ్లో ఓడినా పెద్ద మొత్తంలోనే వస్తాయి. అలాంటి సువర్ణావకాశాన్ని ఇప్పుడు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు సరికొత్త మిక్స్‌తో మార్చేయడంతో స్పెషలిస్టు డబుల్స్ ఆటగాళ్ల ఆదాయానికి గండికొట్టారు.
మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులు సైతం ఇదే ధోరణిని అవలంభిస్తే డబుల్స్ ప్లేయర్లకు కోలుకోలేని దెబ్బ పడుతుంది. గత యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా నిలిచిన ఇటలీ జంట సారా ఎరాని–వావసొరి నిర్వాహకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు.