
36–33తో గెలిచిన యు ముంబా
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా ఆఖర్లో పుంజుకొని తమిళ్ తలైవాస్‌కు షాక్ ఇచ్చింది. మాజీ చాంపియన్ యు ముంబా 36–33 పాయింట్ల తేడాతో తలైవాస్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యు ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ 9, ఆల్‌రౌండర్ అనిల్ 8 పాయింట్లు సాధించారు. డిఫెండర్లలో లోకేశ్, రింకూ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. తమిళ్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 18 సార్లు కూతకెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు.
మిగతా వారిలో కెపె్టన్ పవన్ సెహ్రావత్ 7, డిఫెండర్లు నితీశ్ కుమార్, హిమాన్షు చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్‌కు బెంగాల్ వారియర్స్ చేతిలో చుక్కెదురైంది. కెపె్టన్ దేవాంక్ (21) రెయిడింగ్‌లో చెలరేగడంతో 2019 చాంపియన్ బెంగాల్ 54–44తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. వారియర్స్ జట్టులో దేవాంక్‌తో పాటు మరో రెయిడర్ మన్‌ప్రీత్ (13) అదరగొట్టాడు. స్టీలర్స్ జట్టులో రెయిడర్లు శివమ్ పటారే (17), వినయ్ (13) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధాస్, పుణేరి పల్టన్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి.