
యు ముంబాపై ఘనవిజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో దబంగ్ ఢిల్లీ తిరిగి గెలుపుబాట పట్టింది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన దబంగ్ ఢిల్లీ గత మ్యాచ్‌లో ఓడినా... వెంటనే కోలుకొని తిరిగి విజయం సాధించింది. లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 47–26 పాయింట్ల తేడాతో యు ముంబాను మట్టికరిపించింది. దబంగ్ ఢిల్లీ తరఫున అశు మలిక్ 23 పాయింట్లతో విజృంభించాడు.
నీరజ్ నర్వాల్ 7 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 7 విజయాలు, ఒక పరాజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని తిరిగి పాయింట్ల పట్టికలో ‘టాప్’కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ ‘టై బ్రేకర్’లో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది.
నిర్ణీత సమయంలో ఇరు జట్ల పాయింట్లు 36–36తో సమం కాగా... విజేతను తేల్చేందుకు నిర్వహించిన టై బ్రేకర్‌లో యూపీ యోధాస్ 6–5తో బుల్స్‌ను చిత్తుచేసి ముందంజ వేసింది. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించాడు. శుక్రవారం లీగ్‌లో విశ్రాంతి దినం... శనివారం జరగనున్న మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.