
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ లో తెలుగు టైటాన్స్ రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ 44–34 తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. టైటాన్స్ జట్టులో భరత్ 12, విజయ్ 11 పాయింట్లు సాధించారు. రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అంకిత్ చెరో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 13 పాయింట్లు సాధించాడు.
డిఫెండర్లలో నితీశ్ (6), ఆశిష్ (5) మెరుగ్గా ఆడారు. అనంతరం పోటాపోటీగా జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ 35–36తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దబంగ్ కెప్టెన్ అశు మలిక్ 21 పాయింట్లు సాధించాడు. జైపూర్ తరఫున రెయిడర్లు నితిన్ (14), సాహిత్ (10) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణాతో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.