అసాధారణం... దేవేంద్ర ప్రస్థానం

Tokyo Paralympics: Discus thrower Devendra Jhajharia clinched silver - Sakshi

2004 పారాలింపిక్స్‌లో స్వర్ణం...

2021లో రజతం... ఈ రెండింటి మధ్య 2016లో మరో ఒలింపిక్‌ స్వర్ణం...

దేవేంద్ర ఝఝారియా గెలుపు ప్రస్థానమిది. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్‌ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది.

అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్‌ ట్యూబ్‌ అతని ప్రాక్టీస్‌ కిట్‌ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్‌ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి.

ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్‌ షాక్‌ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్‌జోర్‌’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్‌ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్‌–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా  చెప్పవచ్చు.

‘మా నాన్న చేసిన త్యాగాలు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. కొద్ది రోజుల క్రితం ఒలింపిక్స్‌ కోసం నా శిక్షణ సాగుతున్న సమయంలోనే క్యాన్సర్‌తో ఆయన మరణించారు. ఈ పతకం నాన్నకు అంకితం.’      
– దేవేంద్ర

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top