కొనసాగుతున్న సంజూ శాంసన్‌ విధ్వంసకాండ | Sanju Samson on Fire in Kerala T20 League – Sends Strong Message Ahead of Asia Cup | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సంజూ శాంసన్‌ విధ్వంసకాండ

Aug 28 2025 4:20 PM | Updated on Aug 28 2025 4:31 PM

Third fifty plus score for sanju samson in KCL

టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ కేరళ టీ20 లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా ఓ సుడిగాలి శతకం (అరైస్ కొల్లాం సైల‌ర్స్‌పై 51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు), ఓ మెరుపు అర్ద శతకం (త్రిస్సూర్‌ టైటాన్స్‌పై  46 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 89 పరుగులు) బాదిన సంజూ.. ‌ఓ మ్యాచ్‌ గ్యాప్‌ ఇచ్చి మరో విధ్వంసకర అర్ద శతకం బాదాడు. 

ఈ టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్‌కు ఆడుతున్న సంజూ.. అదానీ ట్రివేన్‌డ్రమ్‌ రాయల్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 28) జరుగుతున్న మ్యాచ్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు.

కేసీఎల్‌లో సంజూ బ్యాట్‌ నుంచి జాలువారిన మూడు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఓపెనింగ్‌ స్థానంలో వచ్చినవే. ఈ మూడు మెరుపు ఇన్నింగ్స్‌ల్లో సంజూ ఏకంగా 21 సిక్సర్లు కొట్టాడు. సంజూ ఇదే భీకర ఫామ్‌ను ఆసియా కప్‌లో కూడా కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.

ఇక గిల్‌కు కష్టమే..!
ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కినప్పటికీ.. తుది జట్టులో అతని స్థానంపై క్లారిటీ లేదు. సంజూ గతకొంతకాలంగా టీమిండియా ఓపెనర్‌గా సెటిల్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ కూడా స్థిర‍ం‍గా రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో భారత సెలెక్టర్లు ఆసియా కప్‌ కోసం మరో ఓపెనర్‌ ఎంపిక చేసి సంజూ స్థానానికి ఎసరు పెట్టారు.

ఈ టోర్నీ కోసం శుభ్‌మన్‌ గిల్‌ను‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో తుది జట్టులో అతని స్థానం పక్కా అయ్యింది. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఇటీవలికాలంలో అద్భుతంగా ఆడుతుండటంతో అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడంతో అభిషేక్‌ సేఫ్‌ జోన్‌లో ఉంటాడు. ఈ పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్‌ చూపు సంజూపై పడింది. అతన్ని మిడిలార్డర్‌లో పంపి, అభిషేక్‌కు జతగా గిల్‌ను ఓపెనింగ్‌ పంపాలని ప్రణాళికలు వేసుకుంది.

ఈ ప్రచారం మొదలు కాగానే సంజూలోని బీస్ట్‌ బయటికి వచ్చాడు. తన ఓపెనింగ్‌ స్థానం కోసం గిల్‌ పోటీ వస్తున్నాడని గ్రహించి తనలోని విధ్వంకర కోణాన్ని బయటికి తీశాడు. కేరళ లీగ్‌లో విధ్వంసకాండ సృష్టిస్తూ ఆసియా కప్‌లో ఓపెనింగ్‌ స్థానం కోసం తానే అర్హుడినంటూ గర్జిస్తున్నాడు. 

సంజూ ప్రదర్శనలు చూసిన తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్‌ పునరాలోచించుకోవాలి. ఓపెనర్‌గా ఇంత భీకర ఫామ్‌లో ఉన్న సంజూను మిడిలార్డర్‌లో పంపిస్తే చాలా పెద్ద తప్పిదమే చేసినట్లవుతుందని గ్రహించాలి. వైస్‌ కెప్టెన్‌ అయినా గిల్‌ స్థానాన్నే కదిలించాలి. అభిషేక్‌కు జతగా సంజూనే ఓపెనర్‌గా కొనసాగించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement