Sanju Samson: ఒకే బంతికి 2 సిక్సర్లు.. మొత్తంగా 16 సిక్సర్లు | 16 SIXES BY SANJU SAMSON IN JUST 2 GAMES IN KCL | Sakshi
Sakshi News home page

Sanju Samson: ఒకే బంతికి 2 సిక్సర్లు.. మొత్తంగా 16 సిక్సర్లు

Aug 26 2025 6:46 PM | Updated on Aug 26 2025 6:52 PM

16 SIXES BY SANJU SAMSON IN JUST 2 GAMES IN KCL

ప్రస్తుతం జరుగుతున్న కేరళ టీ20 క్రికెట్‌ లీగ్‌లో టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా 16 సిక్సర్లు బాదాడు. తొలి మ్యాచ్‌లో 7 సిక్సర్లు.. రెండో మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 9 సిక్సర్లు కొట్టాడు.

ఇవాళ (ఆగస్ట్‌ 26) త్రిస్సూర్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ ఓ అరుదైన ఘనత సాధించాడు. నో బాల్‌ అయిన ఓ బంతికి రెండు సిక్సర్లు బాది 13 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 46 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు.

అంతకుముందు తొలి మ్యాచ్‌లో సంజూ విధ్వంసకర శతకం బాదాడు. అరైస్ కొల్లాం సైల‌ర్స్‌పై 51 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. సంజూ బీభత్సం ధాటికి సైలర్స్‌పై అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న కొచ్చి బ్లూ టైగర్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా.. ఆషిక్‌ సిక్సర్‌ కొట్టి టైగర్స్‌ను విజయతీరాలు దాటించాడు.

త్రిస్సూర్‌ టైటాన్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లోనూ ఇంచుమించు ఇలాంటి డ్రామానే చోటు చేసుకుంది. అయితే గెలిచించి మాత్రం సంజూ జట్టు కాదు. సంజూ విధ్వంసం తర్వాత బ్లూ టైగర్స్‌ త్రిస్సూర్‌ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో టైటాన్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఓపెనర్‌ అహ్మద్‌ ఇమ్రాన్‌ (72) ఒంటరిపోరాటం చేసి గెలుపుపై ఆశలు కోల్పోకుండా చేశాడు. 

ఇమ్రాన్‌ ఔటయ్యాక టైటాన్స్‌ను గెలిపించే బాధ్యత కెప్టెన్‌ సిజిమోన్‌ జోసఫ్‌ (42 నాటౌట్‌), అర్జున్‌ (31 నాటౌట్‌) తీసుకున్నారు. చివరి 5 ఓవర్లలో గెలుపుకు 66 పరుగులు అవసరమైన దశలో సిజిమోన్‌, అర్జున్‌ చెలరేగి ఆడారు. వరుసగా ఓవర్‌కు 12, 16, 13, 10, 15 పరుగులు పిండుకున్నారు. 

చివరి 3 బంతులకు 12 పరుగులు అవసరమైన తరుణంలో సిజిమోన్‌ సిక్సర్‌, డబుల్‌, బౌండరీ బాది తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ ఔటైన తర్వాత బ్లూ టైగర్స్‌ ఇన్నింగ్స్‌ లయ తప్పింది. సంజూను ఔట్‌ చేసిన తర్వాత అజినాస్‌ అనే బౌలర్‌ వరుసగా మరో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. సంజూ క్రీజ్‌లో ఉన్నంత సేపు టైగర్స్‌ స్కోర్‌ 200 పరుగుల మార్కును తాకేలా కనిపించింది. అయితే సంజూ ఔట్‌ కావడంతో పాటు ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో టైగర్స్‌ 188 పరుగులకే పరిమితమైంది.

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే తుది జట్టులో అతని స్థానంపై మాత్రం అనుమానాలు నెలకొన్నాయి.రెగ్యుల‌ర్ ఓపెన‌ర్‌గా  శుభ్‌మ‌న్‌ గిల్ రీఎంట్రీ ఇవ్వడమే ఇందుకు కారణం. గిల్‌.. అభిషేక్ శ‌ర్మ‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని టీమిండియా మేనేజ్‌మెంట్‌ సంకేతాలిచ్చింది.

ఒకవేళ సంజూను తుది జట్టులో తీసుకున్నా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపే అవకాశం ఉంది. అయితే మిడిలార్డ‌ర్‌లో అతడికి అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. కేరళ లీగ్‌లో ఓపెనర్‌గా సంజూ భీకర ఫామ్‌ను చూసిన తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement