
ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) వికెట్లు తీశారు.
అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
ఓపెనర్ ఆమిర్ కలీమ్ (64), వన్ డౌన్‌లో వచ్చిన హమ్మద్ మీర్జా (51) అద్బుతమైన అర్ద సెంచరీలతో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మరో ఓపెనర్, ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (32) కూడా పర్వాలేదనిపించారు.
ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సూపర్-4కు అర్హత సాధించగా.. ఒమన్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. సూపర్-4 దశలో భారత్ సెప్టెంబర్ 21న పాకిస్తాన్‌తో తలపడుతుంది.