
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల తన సొంత రాష్ట్రం కేరళలో జరిగిన టీ20 టోర్నీ (KCL 2025) ద్వారా అర్జించిన జీతాన్ని సహచరులు, సహాయక బృందానికి విరాళంగా ఇచ్చాడు.
ఈ టోర్నీ ద్వారా సంజూ రూ. 26.8 లక్షల జీతాన్ని పొందాడు. ఈ మొత్తాన్ని కొచ్చి బ్లూ టైగర్స్ బృందానికి ఇచ్చేసి ఉదారతను చాటుకున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ వేలంలో సంజూ రూ. 50 లక్షలకు (ఈ సీజన్ వేలంలో ఇదే అత్యధికం) అమ్ముడుపోయాడు. అయితే అతనికి కొచ్చితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా తన వేతనంలో సగం డబ్బుకే ఆడేందుకు ఒప్పుకున్నాడు.
Sanju Samson's brother "Saly Samson" led Kochi Blue Tigers won the KCL 2025. 🏅
- Sanju Samson played an important role in the Group Stage with 368 runs from 5 Innings. pic.twitter.com/w7ZFClxpGz— Johns. (@CricCrazyJohns) September 8, 2025
KCL 2025లో సంజూ ప్రాతినిథ్యం వహించిన కొచ్చి బ్లూ టైగర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఏరిస్ కొల్లమ్ టైగర్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. సంజూ ఫైనల్, సెమీఫైనల్లో ఆడకపోయినా, కొచ్చి టైటిల్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
లీగ్ దశలో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 186.80 స్ట్రయిక్‌రేట్‌తో 73.60 సగటున 368 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీతో కలిపి నాలుగు 50 ప్లస్ స్కోర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో కొచ్చిని ఛాంపియన్‌గా నిలిపింది (కెప్టెన్) సంజూ సోదరుడు శాలీ శాంసన్ కావడం మరో విశేషం. శాలీ కూడా ఈ టోర్నీలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు.
సంజూకు కేరళ క్రికెట్‌పై అమితాసక్తి ఉంది. తన సొంత రాష్ట్రం నుంచి చాలా మంది టీమిండియాకు ఆడాలన్నది అతని కల. అతనికి తన KCL టీమ్ కొచ్చి బ్లూ టైగర్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఈ ఇష్టంలో భాగంగానే అతను తన జీతం మొత్తాన్ని సహచరులకు విరాళంగా ఇచ్చాడు.
సంజూకు ఇలాంటి దానాలు కొత్తేమీ కాదు. తన పేరిట ఓ ట్రస్ట్‌ను నడిపిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఇందుకుగానూ కేరళ ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు పొందాడు. గత దశాబ్దకాలంలో కేరళ నుంచి టీమిండియాకు ఆడిన క్రికెటర్ సంజూ ఒక్కడే.
ఇదిలా ఉంటే, సంజూ KCLలో అద్భుతంగా రాణించినప్పటికీ భారత తుది జట్టులో (ఆసియా కప్‌లో) స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. సంజూ ఆడాల్సిన ఓపెనింగ్ స్థానం కోసం జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పోటీపడుతున్నాడు. గిల్‌ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ప్రమోట్ చేయడంలో భాగంగా సంజూపై వేటు పడుతుందని టాక్ నడుస్తుంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.