
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తన సొంత రాష్ట్రం కేరళలో జరుగుతున్న టీ20 లీగ్‌లో వరుస విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు.
ఈ టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో (అరైస్ కొల్లాం సైలర్స్‌పై 51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించిన సంజూ.. తాజాగా రెండో మ్యాచ్‌లోనూ అదే తరహా విధ్వంసం కొనసాగించాడు.
ఈ టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంజూ.. ఇవాళ (ఆగస్ట్ 26) త్రిస్సూర్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 46 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.
సంజూ ఔట్ కాగానే టైగర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతోంది. త్రిస్సూర్ బౌలర్ కే అజినాస్ సంజూను ఔట్ చేసిన తర్వాత వరుసగా మరో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. సంజూ క్రీజ్‌లో ఉన్నంత సేపు 200 దిశగా సాగిన టైగర్స్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది.
18 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 167/7గా ఉంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో సంజూతో పాటు అతడి అన్న సాలీ శాంసన్ (6 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇదిలా ఉంటే, ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే తుది జట్టులో అతని స్థానంపై మాత్రం అనుమానాలు నెలకొన్నాయి. రెగ్యులర్ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడమే ఇందుకు కారణం. గిల్.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని టీమిండియా మేనేజ్‌మెంట్ సంకేతాలిచ్చింది.
ఒకవేళ సంజూను తుది జట్టులో తీసుకున్నా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపే అవకాశం ఉంది. అయితే మిడిలార్డర్‌లో అతడికి అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. కేరళ లీగ్‌లో ఓపెనర్‌గా సంజూ భీకర ఫామ్‌ను చూసిన తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్ మనసు మార్చుకుంటుందేమో చూడాలి.