సంజూతో సూర్య (PC: BCCI)
సారథిగా టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. బ్యాటర్‌గా పేలవ ఫామ్, వయసురీత్యా అతడిని మున్ముందు టీ20 ఫార్మాట్‌లో పరిశీలించే అవకాశం లేదని సెలక్టర్లు పరోక్షంగా చెప్పేశారు.
ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి (IOA)కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అందజేసింది. ఇందులో 35 ఏళ్ల సూర్యకుమార్ పేరు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.
ఆ సమావేశంలోనే నిర్ణయం!
ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వారసుడు ఎవరన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ఆరంభానికి ముందు బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
ఆ మీటింగ్‌లోనే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పంపే జట్ల గురించి చర్చించనున్నట్లు.. అదే విధంగా టీ20 కొత్త కెప్టెన్ గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..
ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం!
‘‘సూర్యను సారథిగా తొలగించే ముందే కొత్త కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఈ రేసులో ముందున్నారు. వరల్డ్‌కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.
అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల రూపంలో సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. అతడు బ్యాటర్‌గా ఫామ్‌లోకి వస్తే అంతా బాగానే ఉంటుంది. లేదంటే మున్ముందు జట్టులో చోటు కష్టమే.
నిజానికి మేనేజ్‌మెంట్ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహకాల్లో ఉంది. అందుకే టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావించింది.
సెప్టెంబరు 19 నుంచి
అయితే, ఒకవేళ భారత ప్రభుత్వం పూర్తిస్థాయి జట్టును ఆసియా క్రీడలకు పంపాలని ఆదేశిస్తే బీసీసీఐ అందుకు తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో వీటి కోసం రెండు వేర్వేరు జట్లను ఎంచుకునేందుకు వీలుగా 30 మందితో పెద్ద జాబితాను బోర్డు ప్రకటించింది. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ జట్టును నడిపిస్తాడు కాబట్టి ఆసియా క్రీడల కోసం అతడి పేరును పరిశీలించలేదు.
ఇక ప్రాబబుల్స్‌లోనే అయినా తొలిసారి భారత సీనియర్ టీమ్ బృందంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది.
ఆసియా క్రీడల ప్రాబబుల్స్ జాబితా:
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.
చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్


