
Photo Courtesy: BCCI
ఆరెంజ్ ఆర్మీ అశలను ఆవిరి చేసే వార్త!.. హైదరాబాద్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలకు హైదరాబాద్‌లోనే తెరపడింది. దీంతో ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ముందుకా... వెనక్కా అని ఈ నెల 18న లక్నోలో సూపర్‌జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ వరకు నిరీక్షించాల్సిన పని లేకుండానే వరుణుడు తేల్చేశాడు.
కమిన్స్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో మొదలైన మ్యాచ్‌పై విరామంలో నీళ్లతో నింపేశాడు. చినుకులా కురిసిన వాన... వరదలా మారింది. మైదానం మొత్తాన్ని చిత్తడి చిత్తడి చేసింది. దీంతో తెరిపినిచ్చినా... తేరుకొని ఆడే అవకాశమే లేకపోయింది. ఇక చేయాల్సిందల్లా మిగిలిపోయిన ఆ మూడు మ్యాచ్‌లు ఆడటం తప్ప గత ఏడాది రన్నరప్ ‘రైజర్స్’కు ఇంకేం మిగల్లేదు!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఈసారి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ముగిసింది. సొంతగడ్డపై సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ముందుకెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి.
ఇక మిగతా మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో కాస్త మెరుగైన స్థానంలో నిలవడమే మిగిలుంది. సన్‌రైజర్స్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా 13 పాయింట్ల వద్దే నిలిచిపోతుంది. టాప్–4లో నిలిచే జట్లే ‘ప్లే ఆఫ్స్’ దశకు చేరుతాయి. ఇప్పటికే నాలుగు జట్లు కనీసం 14 పాయింట్ల సంఖ్యను అందుకున్నాయి.
ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు), ధాటిగా ఆడారు.
ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ విరామానికి ఇరుజట్ల ఆటగాళ్లు వెళ్లగానే మైదానంలోకి అనుకోని అతిథిగా వచ్చిపడిన వాన స్టేడియాన్ని ముంచెత్తింది. భారీ వర్షం చాలా సేపటికి తగ్గినా... అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..
వర్షం కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవమయ్యాయి. ఇప్పటికి మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచిన ఢిల్లీ ఖాతాలో పన్నెండు పాయింట్లు ఉండగా.. మ్యాచ్ రద్దైనందు వల్ల నిబంధనల ప్రకారం తాజాగా మరో పాయింట్ అదనంగా చేరింది. దీంతో ప్రస్తుతం పదమూడు పాయింట్లతో ఢిల్లీ పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేటు (0.362) పరంగానూ మెరుగ్గానే ఉంది.
ఇక లీగ్ దశలో ఢిల్లీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మే 8న ధర్మశాలలో, మే 11న గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీలో.. అదే విధంగా వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మే 15న అక్షర్ సేన తలపడాల్సి ఉంది.
ఈ మూడు మ్యాచ్‌లలో గెలిస్తే పందొమ్మిది పాయింట్లతో సులువుగానే ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరుతుంది. రెండు గెలిస్తే 17 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇలాంటి దశలో నెట్ రన్‌రేటు భారీగా మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ రెండు మ్యాచ్‌లలో గనుక ఓడితే పదిహేను పాయింట్లే వస్తాయి కాబట్టి.. ఇప్పటికే పద్నాలుగేసి పాయింట్లతో ఉన్న ముంబై, గుజరాత్ ఒక్కో మ్యాచ్ గెలిస్తే టాప్-4కు ఈజీగానే చేరుకుంటాయి. ఇదంతా కాక.. ఢిల్లీ గనుక మూడూ ఓడిపోతే కథ కంచికే!
చదవండి: IPL 2025 MI Vs GT: సమఉజ్జీల సమరం
ప్రస్తుత పాయింట్ల పట్టికలో టాప్-5 ఇలా.. PC: IPL
SMACKED...and again! 🔥
Ashutosh Sharma adding the much-needed fire to #DC's innings 💪
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @DelhiCapitals pic.twitter.com/sMA3ZLKotz— IndianPremierLeague (@IPL) May 5, 2025