MI Vs GT: సమఉజ్జీల సమరం | MI Vs GT High-voltage Clash As Race For Playoffs Intensifies, Check When And Where To Watch Match, Predicted Playing XI | Sakshi
Sakshi News home page

IPL 2025 MI Vs GT: సమఉజ్జీల సమరం

May 6 2025 6:14 AM | Updated on May 6 2025 8:19 AM

Mumbai Indians vs Gujarat Titans in high-voltage clash as race for playoffs intensifies

నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్‌ ‘ఢీ’

రాత్రి గం.7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో వరుస విజయాలతో విజృంభిస్తున్న ముంబై ఇండియన్స్‌ జుట్టు గుజరాత్‌ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఆరంభంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే నెగ్గిన హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ‘ప్లే ఆఫ్స్‌’కు చేరువైంది. మరోవైపు 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లతో ఉన్న గుజరాత్‌ కూడా ‘ప్లే ఆఫ్స్‌’ బెర్తు ఖరారు చేసుకోవాలని తహతహలాడుతోంది. 

ఈ నేపథ్యంలో సమ ఉజ్జీల మధ్య మంగళవారం వాంఖడే వేదికగా కీలక పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం సాధించింది. అయితే ఆలస్యంగా రేసులోకి వచి్చన ఐదుసార్లు చాంపియన్‌ ముంబై... గత ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావడం ముంబైకి కొండంత బలం కాగా... రికెల్టన్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నారు.

 ముఖ్యంగా సూర్యకుమార్‌ 67.86 సగటుతో 475 పరుగులు చేసి ‘ఆరెంజ్‌ క్యాప్‌’ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. తిలక్‌ వర్మ, విల్‌ జాక్స్, నమన్‌ ధీర్‌తో ముంబై బ్యాటింగ్‌ బలంగా ఉండగా... బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్, దీపక్‌ చహర్, కరణ్‌ శర్మ కీలకం కానున్నారు. ఈ సీజన్‌లో పాండ్యా బౌలింగ్‌లో 13 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తో 157 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 

సాంట్నర్‌ అందుబాటులో లేకుంటే అతడి స్థానంలో కార్బిన్‌ బాష్‌ బరిలోకి దిగొచ్చు. మరోవైపు గుజరాత్‌ కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. టాప్‌–3 ఆటగాళ్లు శుబ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్, జోస్‌ బట్లర్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్‌ 50.40 సగటుతో 504 పరుగులు చేయగా... జోస్‌ బట్లర్‌ 78.33 సగటుతో 470, గిల్‌ 51.67 సగటుతో 465 పరుగులు చేశారు. 

ఈ సీజన్‌లో గుజరాత్‌ జైత్రయాత్రకు ఈ ముగ్గురే ప్రధాన కారణం కాగా... వాషింగ్టన్‌ సుందర్, షారుక్‌ ఖాన్, రాహుల్‌ తెవాటియా రూపంలో టైటాన్స్‌కు నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. నిషేధం అనంతరం రబడ తిరిగి అందుబాటులోకి రాగా... ఈ మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. బౌలింగ్‌లో ప్రసిధ్‌ కృష్ణ, మొహమ్మద్‌ సిరాజ్, సాయి కిషోర్, రషీద్‌ ఖాన్‌ కీలకం కానున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రసిధ్‌ కృష్ణ 19 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా... సిరాజ్‌ 14, సాయి కిషోర్‌ 12 వికెట్లు తీశారు.  

తుది జట్లు (అంచనా) 
ముంబై ఇండియన్స్‌: హార్దిక్‌ (కెప్టెన్‌), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, విల్‌ జాక్స్, నమన్‌ ధీర్, కార్బిన్‌ బాష్‌/సాంట్నర్, దీపక్, బౌల్ట్, బుమ్రా, కరణ్‌ శర్మ. 

గుజరాత్‌ టైటాన్స్‌: గిల్‌ (కెపె్టన్‌), సాయి సుదర్శన్, బట్లర్, సుందర్, షారుక్‌ ఖాన్, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్, కోట్జీ, సాయి కిషోర్, ప్రసిధ్‌ కృష్ణ, సిరాజ్, ఇషాంత్‌ శర్మ/రబడ.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement