సన్‌రైజర్స్‌ గెలిచి నిలిచింది.. | SRH Beat RCB By 5 Wickets | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ గెలిచి నిలిచింది..

Oct 31 2020 10:51 PM | Updated on Nov 2 2020 3:53 PM

SRH Beat RCB By 5 Wickets - Sakshi

షార్జా: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను ఆరెంజ్‌ ఆర్మీ 14.1 ఓవర్లలో  ఐదు  వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో ప్లేఆఫ్‌ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. వృద్ధిమాన్‌ సాహా( 39; 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో పాటు మనీష్‌ పాండే(26; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హోల్డర్‌(26 నాటౌట్‌; 10 బంతుల్లో  1 ఫోర్‌, 3 సిక్స్‌లు) ఆకట్టుకోవడంతో  సన్‌రైజర్స్‌ సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది సన్‌రైజర్స్‌ ఆరో విజయం కాగా, పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తుకు ఢోకా ఉండదు.(సందీప్‌ రికార్డు బౌలింగ్‌..కోహ్లి మరో ‘సారీ’)

సాధారణ లక్ష్య ఛేదనలో ఆదిలోనే సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(8) నిరాశపరిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి వార్నర్‌ ఔటయ్యాడు. ఆ తరుణంలో సాహాకు మనీష్‌ జత కలిశాడు.వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మనీష్‌ ఔటయ్యాడు. చాహల్‌ బౌలింగ్‌లో క్రిస్‌ మోరిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. విలియమ్సన్‌(8) విఫలమయ్యాడు. ఉదాన బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటైన క్రమంలో సన్‌రైజర్స్‌లో ఆందోళన మొదలైంది. కాగా, హోల్డర్‌ మ్యాచ్‌ను గట్టెక్కించాడు. అభిషేక్‌ శర్మ(8; 5 బంతుల్లో 1 సిక్స్‌)తో కలిసి 27 పరుగులు జత చేయడంతో సన్‌రైజర్స్‌ ఒత్తిడి క్లియర్‌ అయ్యింది.  ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ రెండు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌, సైనీ, ఉదానాలకు తలో వికెట్‌ లభించింది. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 120 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను జోష్‌ ఫిలెప్పి-దేవదూత్‌ పడిక్కల్‌లు ఆరంభించారు. అయితే ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి పడిక్కల్‌(5) బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లి(7) కూడా నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ వేసిన మరో ఓవర్‌లో విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు.

ఆ తరుణంలో ఫిలెప్పి- ఏబీ డివిలియర్స్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 43 పరుగులు జత చేసిన తర్వాత డివిలియర్స్‌(24) పెవిలియన్‌ చేరాడు. నదీమ్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో ఏబీ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాసేపటికి ఫిలెప్పి((32) కూడా ఔట్‌ కావడంతో ఆర్సీబీ 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  వాషింగ్టన్‌ సుందర్‌(21) ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ వంద పరుగుల మార్కును  దాటింది. క్రిస్‌ మోరిస్‌(3), ఇసురు ఉదాన(0)లను ఒకే ఓవర్‌లో హోల్డర్‌ ఔట్‌ చేయడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది.  సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, హోల్డర్‌లు  చెరో రెండు వికెట్లు సాధించగా, నటరాజన్‌, నదీమ్‌, రషీద్‌ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement