భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana Wedding) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ స్టైలిష్ ఓపెనర్ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మహిళా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది.
భారత జట్టు ఓపెనర్‌గా
భారత జట్టు ఓపెనర్‌గా ఇప్పటికే వన్డేల్లో 115 మ్యాచ్‌లు ఆడి.. 14 శతకాల సాయంతో 5253 పరుగులు సాధించిన స్మృతి.. ఏడు టెస్టుల్లో 629 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 153 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 3982 పరుగులు సాధించింది. అంతేకాదు.. మహిళల ప్రీమియర్ లీగ్ (WCL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ అందించిన ఘనత ఆమెది.
ఆరేళ్లుగా ప్రేమ
ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్-2025తో బిజీగా ఉన్న స్మృతి మంధాన.. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆమె పెళ్లి పనుల్లో తలమునకలు కానున్నట్లు సమాచారం. కాగా స్మృతి చాన్నాళ్లుగా.. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్‌షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు.
ఇండోర్ కోడలు కాబోతోంది
ఆ తర్వాత ప్రతి వేడుకలోనూ కలిసి కనిపించారు స్మృతి- పలాష్. స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు పలాష్. ఇటీవల.. ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అంటూ పలాష్ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు.
కాగా 1996లో ముంబైలో జన్మించిన స్మృతి మంధాన.. తనకు రెండేళ్ల వయసు ఉన్నపుడు సాంగ్లీకి వెళ్లింది. మాధవ్‌నగర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మరోవైపు.. పలాష్ 1995లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు.
శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న అతడు.. బాలీవుడ్‌లో కంపోజర్‌గా సిర్థపడ్డాడు. పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్ సింగర్. తనకు కూడా స్మృతితో మంచి అనుబంధం ఉందని పాలక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
పెళ్లి డేట్ ఫిక్స్!
ఇక స్మృతి స్వస్థలం సాంగ్లీలోనే పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 20న స్మృతి- పలాష్ పెళ్లి తంతు జరుగనున్నట్లు తెలుస్తోంది.


