తల్లి షబ్నమ్‌తో యువీ
యువరాజ్ సింగ్.. భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. టీమిండియా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర. క్యాన్సర్ బారిన పడినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మహమ్మారిని జయించి మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన యోధుడు యువీ.
సాధారణంగా యువీ (Yuvraj Singh) ఎల్లప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. కానీ అతడి బాల్యం భారంగా గడిచిందని చాలా మందికి తెలియదు. ఇందుకు ప్రధాన కారణం యువీ తల్లిదండ్రులు షబ్నమ్ (Shabnam)- యోగ్‌రాజ్ (Yograj Singh)ల మధ్య గొడవలు. ఈ విషయం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో యువీ స్వయంగా ప్రస్తావించాడు.
ప్రతిభ గల క్రికెటర్
‘‘మా నాన్న అత్యంత ప్రతిభ గల క్రికెటర్. ఆట కోసం చాలా కష్టపడ్డాడు. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఆయన కాస్త దూకుడుగా ఉంటారు. తనకు నచ్చినట్లే అన్నీ ఉండాలంటారు. స్వయంగా తన విషయంలోనూ అలాగే కఠిన నియమాలు పెట్టుకుంటారు.
నన్ను కూడా ఆయనలాగే క్రికెటర్‌ని చేయాలనుకున్నారు. నేను టీమిండియాకు ఆడాలని కలలు కన్నారు. అందుకే నా పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించేవారు.
అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది
ఇక మా అమ్మ షబ్నమ్ గురించి చెప్పాలంటే.. పిల్లల కోసం తల్లి మాత్రమే త్యాగాలు చేయగలగదని ఆమెను చూస్తే అర్థమైంది. నన్ను తీర్చిదిద్దేందుకు అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది. ఇలాంటి తల్లి ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని.
అప్పుడు నాకు 14- 15 ఏళ్ల వయసు ఉంటుంది. అప్పట్లో అమ్మానాన్న తరచూ గొడవపడేవారు. ఆ వాతావరణం నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించేది. అప్పటికే నేను క్రికెటర్‌గా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాను. కానీ ఇంట్లో గొడవల వల్ల మనసంతా కకావికలం అయ్యేది.
అమ్మానాన్నలకు విడాకుల సలహా ఇచ్చింది నేనే
అప్పుడే నేను మా అమ్మానాన్నకు ఓ సలహా ఇచ్చాను. విడిపోయి ఎవరి దారిలో వారు సంతోషంగా బతకమని చెప్పాను. నాకు, నా తమ్ముడికి.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ ఇదే మంచిదని వారితో అన్నాను’’ అంటూ తన తల్లిదండ్రులకు విడాకులు తీసుకోమని ఐడియా ఇచ్చింది తానేనని యువీ చెప్పాడు. చిన్న వయసులోనే యువీ అంత పెద్ద మాట చెప్పడం అతడు అనుభవించిన క్షోభకు నిదర్శనం.
పేరెంటింగ్ టిప్
ఏదేమైనా తల్లిదండ్రులు తమ మధ్య ఉన్న విభేదాలు, గొడవల ప్రభావం పిల్లలపై పడకుండా చూసుకోవాలి. లేదంటే గాయపడిన పసి మనసులు తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెరిగినా యువీలా మేటి ఆటగాడిగా ఎదగడం, మానసికంగా దృఢంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో యువీ నిజంగానే గ్రేట్.
రెండో పెళ్లి చేసుకున్న యోగ్‌రాజ్
కాగా యువీకి పదిహేడేళ్ల వయసు ఉన్నపుడు యోగ్‌రాజ్ సింగ్- షబ్నమ్ విడిపోయారు. ఆ తర్వాత యోగ్‌రాజ్.. నీనా అనే పంజాబీ నటిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. సవతి తమ్ముడు, చెల్లెలికి యువీతో సత్సంబంధాలు ఉన్నాయి.
ఇక టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరొందిన యువరాజ్ సింగ్.. 2003-2017 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 8701, 58 టీ20 మ్యాచ్‌లలో 1177 పరుగులు సాధించాడు.
అదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువీ ఖాతాలో తొమ్మిది టెస్టు, 111 వన్డే, 298 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక నటి హాజిల్‌కీచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువీకి కుమారుడు ఓరియాన్, కుమార్తె ఆరా సంతానం.
చదవండి: కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318.. ఒక్క నాన్ 118!.. ఈ రేట్లు ఎక్కడంటే..


