
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ (2), విరాట్ కోహ్లి (4), శ్రేయస్ అయ్యర్ (8) టాప్-10లో కొనసాగుతున్నారు.
గడిచిన వారంలో అద్భుతంగా రాణించిన ఆసీస్ ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీలతో కదంతొక్కిన ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్ వరుసగా ఒకటి, నాలుగు, 40 స్థానాలు మెరుగుపర్చుకుని 11, 44, 78 స్థానాలకు ఎగబాకారు. మరో ఆసీస్ ఆటగాడు జోస్ ఇంగ్లిస్ 23 స్థానాలు మెరుగుపర్చుకుని 64వ స్థానానికి చేరాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసీస్‌తో మూడో వన్డేలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేని కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌ను లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణతో సంయుక్తంగా పంచుకున్నాడు. గత వారమే టాప్ ర్యాంక్‌కు చేరిన మహారాజ్ గడిచిన వారంలో ఎలాంటి రేటింగ్ పాయింట్లను సాధించకపోగా.. తీక్షణ పలు పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌కు చేరాడు.
ప్రస్తుతం మహారాజ్, తీక్షణ ఖాతాలో 671 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. షమీ, సిరాజ్ తలో స్థానం మెరుగుపర్చుకుని 12, 13 స్థానాలకు చేరారు.
ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ రీతిలో లబ్ది పొందింది సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి, ఆసీస్ పేసర్లు నాథన్ ఇల్లిస్, సీన్ అబాట్. వీరిలో ఎంగిడి 6, ఇల్లిస్ 21, అబాట్ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 28, 65, 48 స్థానాలకు ఎగబాకారు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మొహమ్మద్ నబీ, సికందర్ రజా టాప్-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాడు జడేజా తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.