ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో క్యాచ్‌ను అందుకునే క్రమంలో అయ్యర్ పక్కటెముకులకు గాయమైంది.
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్‌లు చేయించగా.. గాయం కాస్త తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. దీంతో వచ్చే నెల ఆఖరిలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి.
భారత్‌కు బిగ్ షాక్..
"మ్యాచ్ జరుగుతుండగానే శ్రేయస్ అయ్యర్‌ను స్కాన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ఎడమ ప్రక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ ఉంది.అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమా లేదా అని నిర్ధారించడానికి మరిన్ని రిపోర్ట్‌లు స్కాన్‌లు చేయాల్సి ఉంది.
ఇది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ సమయం పట్టవచ్చు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేము. మూడు వారాలలో అతడు కోలుకుంటే సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు.
ఒకవేళ అయ్యర్ ప్రోటీస్‌తో సిరీస్‌కు దూరమైతే భారత్ గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అయ్యర్ భారత వన్డే సెటాప్‌లో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే గతంలో కూడా శ్రేయస్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. కోలుకుని తిరిగొచ్చాక ఇప్పుడు పక్కటెముల గాయం బారిన పడ్డాడు. కాగా సౌతాఫ్రికా-భారత్ మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్


