వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా ముఖ చిత్రంగా నిలిచిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. మరోసారి తన మార్క్‌ను చూపించాడు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు.
తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికి ఆ తర్వాత రెండు వన్డేల్లో సత్తాచాటాడు. అడిలైడ్‌లో 73 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 38 ఏళ్ల వయసులోనూ అతని ఆట తీరు, షాట్ సెలెక్షన్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేశాయి.
చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రోహిత్.. తన అద్బుత సెంచరీతో అభిమానులకు మరుపురాని ఇన్నింగ్స్‌ను అందించాడు. 237 పరగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆసీస్ టూర్ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఉహగానాలకు తన సెంచరీతోనే హిట్‌మ్యాన్ తెరదించాడు. వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము అని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. ఇక రోహిత్ భవిష్యత్తు ప్రణాళికలపై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడని లాడ్ కూడా స్పష్టం చేశారు.
"రోహిత్‌లో ఇంకా పరుగుల దాహం తీరలేదు. అతడు ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్ చేసిన విధానం, భారత జట్టును గెలిపించిన తీరు నిజంగా అద్భుతం. రోహిత్ తను ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడి ఆ తర్వాత రిటైర్ అవుతాడని" లాడ్ పేర్కొన్నాడు.
కాగా రోహిత్ శర్మ తన కెరీర్‌లో టీ20 వరల్డ్‌కప్, ఆసియాకప్, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకున్నప్పటికి.. వన్డే వరల్డ్‌కప్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రోహిత్ భాగంగా లేడు. ఆ తర్వాత 2015, 2019, 2023 ప్రపంచకప్‌లలోనూ అతడికి నిరాశే ఎదురైంది. దీంతో మరో రెండేళ్లలో జరిగే వరల్డ్‌కప్‌ను గెలుకుని తన కెరీర్‌కు ముగింపు పలకాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు.
చదవండి: ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ..


