వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఆకతాయి వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఇద్దరూ గురువారం రాత్రి హోటల్‌కు తిరిగి వస్తుండగా.. ఇండోర్‌లోని ఖజ్రానా రోడ్ వద్ద ఓ వ్యక్తి వారి వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.
వెంటనే సదరు క్రికెటర్లు జట్టు మేనేజర్‌కు సమాచారం అందించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీలుసు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖజ్‌రానాకు చెందిన 30 ఏళ్ల అకీల్‌ను నిందుతుడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంతకుముందు కూడా అతడిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.
"ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నాము. నిందితుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు సంతోషిస్తున్నాము.
ఈ వన్డే ప్రపంచ కప్‌లో ఆడేందుకు వచ్చిన అన్ని జట్లకు ఇప్పటికే పూర్తి స్ధాయి భద్రతను కల్పించాము. ఇకపై సెక్యూరిటీ మరింత పెంచుతాము. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము." అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) పీటీఐతో పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 30న జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
చదవండి: భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా


