టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని.. అతడు వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపింది.
బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీలోని స్పెషలిస్టులు అతడి రికవరీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని.. శనివారం అతడిని డిశ్చార్జ్ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. కాగా భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే.
పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావం
హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ ఇచ్చిన రన్నింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు బలమైన గాయమైంది. దీంతో వైద్య సిబ్బంది సహాయంతో అతడు మైదానాన్ని వీడగా... ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గుర్తించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు)కు తరలించారు.
స్పందించిన శ్రేయస్
పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించి వైద్యం అందించగా... శ్రేయస్ త్వరితగతిన కోలుకుంటున్నాడు. ఈ విషయంపై గతంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన విడుదల చేసింది. అయితే రెండోసారి వైద్య పరీక్షల అనంతరం శ్రేయస్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
‘ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. రోజు రోజుకు మరింత మెరుగ్గా అనిపిస్తుంది. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని శ్రేయస్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. గాయం కారణంగా మైదానాన్ని వీడినప్పటి నుంచి అయ్యర్... బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉండగా.. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బోర్డు తెలిపింది.
వారికి బీసీసీఐ థాంక్స్
ఈ సందర్భంగా.. సిడ్నీ డాక్టర్ కొరొష్ హగిగి, అతడి వైద్య బృందానికి.. అదే విధంగా.. భారత్‌కు చెందిన డాక్టర్ దిన్షా పార్దీవాలాకు బీసీసీఐ ధన్యవాదాలు చెప్పింది. శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
డిశ్చార్జ్ అయినా
కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా శ్రేయస్ అయ్యర్ మరికొన్నాళ్లు పాటు సిడ్నీలోనే ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. చికిత్స అనంతర పరీక్షల కోసం అతడు సిడ్నీలోనే ఉంటాడని.. విమాన ప్రయాణం చేయొచ్చని వైద్యులు చెప్పిన తర్వాతే భారత్‌కు తిరిగి వస్తాడని తెలిపింది.
చదవండి: రోహిత్ శర్మ ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్


