BCCI బిగ్‌ప్లాన్‌.. 35 మంది ప్లేయర్లు.. కెప్టెన్‌గా అతడు! | Is Shreyas Iyer Captain 2 Indian T20I Teams Playing At Same Time BCCI Says This | Sakshi
Sakshi News home page

BCCI బిగ్‌ప్లాన్‌.. 35 మంది ప్లేయర్లు.. కెప్టెన్‌గా అతడు!

Apr 20 2026 11:54 AM | Updated on Apr 20 2026 12:06 PM

Is Shreyas Iyer Captain 2 Indian T20I Teams Playing At Same Time BCCI Says This

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ద్వారా ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా నుంచి.. వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే వరకు ఈ జాబితాలో ఉన్నారు.

ఇక ఈ టోర్నీలో ఓవైపు సీనియర్లు ఫామ్‌ కొనసాగిస్తుండగా.. యువ ఆటగాళ్లు సైతం దుమ్మురేపుతున్నారు. దీంతో టీమిండియా సెలక్టర్లకు తల నొప్పులు తప్పడంలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా షెడ్యూల్‌ ఎంతగా కిక్కిరిసిపోయి ఉంటుందో తెలిసిందే. ఏడాదంతా భారత పురుషుల జట్టు బిజీబిజీగా గడుపుతుంది.

పూర్తిస్థాయిలో రెండు జట్లు!
ఇటీవలే అదనంగా ముందుగా షెడ్యూల్‌లో లేని ఐర్లాండ్‌, జింబాబ్వే పర్యటనలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు.. ఆసియా క్రీడలు- 2026 (Asian Games) టోర్నీకి కూడా జట్టును పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు టీ20 జట్లను తయారు చేస్తున్నట్లు సమాచారం.

సెలక్టర్ల రాడార్‌లో 30-35 మంది ఆటగాళ్లు
అంతర్జాతీయ షెడ్యూల్‌తో ఆసియా క్రీడల షెడ్యూల్‌ క్లాష్‌ అవుతున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఒకే సమయంలో ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌ సిరీస్‌కు జట్లను పంపాల్సి ఉంది. కాబట్టి ఈసారి కూడా రెండు జట్లను సిద్ధం చేస్తున్నాం.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక చేసే క్రమంలో 30-35 మంది ఆటగాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకునే యోచనలో ఉన్నాము. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆసియా క్రీడల దాకా ఈ విధానం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. 

గతంలో ఇలా..
కాగా 2023 ఆసియా క్రీడల్లో భాగంగా తొలిసారి బీసీసీఐ తమ పురుష, మహిళా జట్లను చైనాకు పంపింది. టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ ఈవెంట్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో మహిళా జట్టు పసిడి పతకాలు గెలిచాయి. అప్పుడు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉండగా.. రుతు కెప్టెన్సీలో ద్వితీయశ్రేణి జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ గెలిచింది.

రేసుగుర్రాలు
కాగా ఈసారి నయా సంచలనం వైభవ్‌ సూర్యవంశీతో పాటు టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌, ప్రియాన్ష్‌ ఆర్య, అంగ్‌క్రిష్‌ రఘువన్షీ ఆసియా క్రీడల నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించనున్నారు. రజత్‌ పాటిదార్‌, ఆయుశ్‌ బదోని, అనుకుల్‌ రాయ్‌, ఖలీల్‌ అహ్మద్‌, కార్తిక్‌ త్యాగి తదితరులు కూడా రేసులో ఉన్నారు.

కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌!
ఈసారి ఆసియా క్రీడల జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అతడు టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబైకర్‌.. గతేడాది కెప్టెన్‌గా పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. తాజా ఎడిషన్‌లోనూ సారథి, బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ హవా కొనసాగుతోంది. 

కాగా 2023 డిసెంబరులో చివరగా అయ్యర్‌ టీమిండియా తరఫున టీ20లు ఆడాడు. అయితే, ఈసారి ఆసియా క్రీడల ద్వారా రీఎంట్రీ ఇచ్చి తనను తాను మరోసారి నిరూపించుకుంటే.. టీమిండియా కెప్టెన్‌గానూ సూర్యకుమార్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.

చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

Advertisement
 
Advertisement
Advertisement