వైరల్‌: బంతి ఎక్కడ పడింది.. నువ్వెక్కడున్నవ్‌‌‌

Sharjeel Khan Hilariously Misjudges Catch In 2nd T20I Vs South Africa - Sakshi

జొహెన్నెస్‌బర్గ్‌: సోమవారం పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్‌ ఓపెనర్‌ షార్జీల్‌ ఖాన్‌ చేసిన పని సోషల్‌ మీడియలో నవ్వులు పూయిస్తుంది. విషయంలోకి వెళితే.. ఉస్మాన్‌ ఖాదీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఒక బంతిని జార్జ్‌ లిండే లాంగాన్‌ మీదుగా భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా లిండే బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. అయితే లాంగాన్‌లో ఉన్న షార్జీల్‌ బంతి ఎక్కడ పడుతుందనే దానిని సరిగ్గా అంచనా వేయలేక బాగా ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అయితే బంతి మాత్రం అతన్ని దాటుకొని వెనకాల పడింది. ఈ ఘటనతో కాసేపు ఆశ్చర్యానికి లోనైన షార్జీల్‌ తాను చేసిన తప్పు తెలుసుకొని సిగ్గుపడ్డాడు. అయితే బంతి బౌండరీ లైన్‌ దాటుతుందేమో అన్న సమయంలో లాంగాఫ్‌ నుంచి వచ్చిన ఫీల్డర్‌ బంతిని అందుకోవడంతో రెండు పరుగులే వచ్చాయి.

అయితే షార్జీల్‌ చర్యపై సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేశారు. అసలే ఫిట్‌నెస్‌లో పూర్‌ అని పేరున్న షార్జీల్‌కు క్యాచ్‌ పట్టుకోవడం కూడా రాదని గేలి చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 50 పరుగులతో రాణించాడు. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్‌ జట్టు 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జార్జి లిండే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (3/23; 10 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు),  ఓపెనర్‌ మక్రమ్‌ 30 బంతుల్లోనే 54 పరుగులతో రాణించడంతో సునాయస విజయాన్ని అందుకుంది.
చదవండి: లిండే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. పాక్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top