సుందరం శార్దూలం...

Shardul Thakur and Washington Sundar bring India back on Day 3 - Sakshi

అర్ధ శతకాలతో అదరగొట్టిన వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్‌ ఠాకూర్‌

ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 336 ఆలౌట్‌

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 21/0

రసకందాయంలో బ్రిస్బేన్‌ టెస్టు

ఒక్క తొలి టెస్టు తప్ప... ప్రతీ టెస్టుకు ముందు భారత్‌కు ప్రతికూలతలే. మ్యాచ్‌ మొదలయ్యాక కష్టాలే! అయినా సరే ప్రతికూలతలకు ఎదురీదుతోంది. కష్టాలన్నీ అధిగమిస్తోంది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ అనుభవజ్ఞులు దూరమవుతున్నా... రిజర్వ్‌ బెంచ్‌ సత్తా చాటుతోంది. నిజం చెప్పాలంటే టీమిండియాది పోరాటం కాదు... అంతకుమించిన ఉక్కు సంకల్పం. అందుకేనేమో ప్రత్యర్థి పైచేయి సాధిస్తున్న ప్రతీసారి భారత్‌ పిడికిలి బిగిస్తోంది. ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఈ భారత్‌–ఆసీస్‌ సిరీస్‌ రసవత్తరంగా మారి యావత్‌ సంప్రదాయ క్రికెట్‌కు కొత్త జీవం పోస్తోంది. ఐదు రోజుల టెస్టు బోర్‌ కాదు బెస్ట్‌ అని చాటి చెబుతోంది.

బ్రిస్బేన్‌: మెరుపుల టి20ల ముందు వెలవెల బోతున్న టెస్టులకు కాలం చెల్లలేదని భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ ప్రతీ మ్యాచ్‌లోనూ నిరూపిస్తోంది. కాదు కాదు చూపిస్తోంది. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను భారత లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మార్చేశారు. ఆతిథ్య బౌలర్లను వీళ్లిద్దరే శాసించారు. ఆదివారం తొమ్మిది మంది బ్యాటింగ్‌కు దిగితే ఈ జోడీ మాత్రమే ఆస్ట్రేలియాను చెమటలు కక్కించింది. భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 111.4 ఓవర్లలో 336 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో హాజల్‌వుడ్‌ (5/57) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యమే పొందిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌ (20 బ్యాటింగ్‌), హారిస్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్‌ జట్టు ఓవరాల్‌ ఆధిక్యం 54 పరుగులు. నాలుగో రోజు రెండు జట్ల ఆటతీరే ఈ మ్యాచ్‌ ఫలితం ఎవరివైపు మొగ్గుతుందో తేల్చనుంది. భారత బౌలర్లు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారా... భారత బౌలింగ్‌ను ధీమాగా ఎదుర్కొని భారీ స్కోరు చేసి ఆసీస్‌ నిలబడుతుందా వేచి చూడాలి.  

‘వంద’ వరకే బాగుంది
తొలి సెషన్‌ ఆరంభంలో బాగున్నట్లు కనిపించిన భారత ఇన్నింగ్స్‌ లంచ్‌లోపే కష్టాల్లోకి జారుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 62/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 100 పరుగుల దాకా బాగానే ఉంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్‌ పుజారా (94 బంతుల్లో 25; 2 ఫోర్లు), కెప్టెన్‌ రహానే (93 బంతుల్లో 37; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న తరుణంలో హాజల్‌వుడ్‌ దెబ్బతీశాడు. 105 స్కోరు వద్ద పుజారాను ఔట్‌ చేశాడు. వేగంగా దూసుకొచ్చి న బంతిని డిఫెన్స్‌ చేయడానికి ప్రయత్నించగా... అది పుజారా బ్యాట్‌ అంచును తగిలి కీపర్‌ పైన్‌ చేతుల్లో పడింది. తర్వాత లంచ్‌ విరామానికి కాస్తముందుగా రహానే ఆటను స్టార్క్‌ ముగించాడు.  

బెంబేలెత్తించిన హాజల్‌వుడ్‌  
భారత్‌ 161/4 స్కోరుతో లంచ్‌ బ్రేక్‌కు వెళ్లొచ్చిన వెంటనే హాజల్‌వుడ్‌ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కుర్రాళ్లను హడలెత్తించాడు. దీంతో రెండో సెషన్‌ మొదలైన రెండో బంతికే మయాంక్‌ అగర్వాల్‌ (75 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్‌) పెవిలియన్‌ చేరాడు. షాట్‌కు ప్రయత్నించిన మయాంక్‌ రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్‌ చేతికి చిక్కాడు. కాసేపటికే రిషభ్‌ పంత్‌ (23; 2 ఫోర్లు) కూడా హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. బౌన్సర్‌ను షాట్‌గా మలిచేందుకు చేసిన పంత్‌ ప్రయత్నం బెడిసింది. అక్కడే గాల్లోకి లేచిన బంతిని గల్లీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న గ్రీన్‌ అందుకోవడంతో పంత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అప్పటికి భారత్‌ స్కోరు 186/6. గత టెస్టులో తమతో ఓ ఆటాడుకున్న పంత్‌ పెవిలియన్‌ చేరడం, ఇకపై వచ్చే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ లేకపోవడంతో ఆసీస్‌ శిబిరంలో ఆనందం ఆకాశాన్నంటింది.  

ఫిఫ్టీ–ఫిఫ్టీలతో బాగుపడింది
కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్‌ సుందర్‌ ... రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దుల్‌ ఠాకూర్‌లు బౌలింగ్‌ కేటగిరీలోనే తుది జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆసీస్‌ గడ్డపై... అది కూడా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌నే గడగడలాడిస్తున్న ఆసీస్‌ పేస్‌ త్రయం హాజల్‌వుడ్, కమిన్స్, స్టార్క్‌ను ఎదుర్కోగలరని ఎవరూ ఊహించలేదు. కానీ వీరిద్దరి ఆట అరివీర పేసర్ల బంతుల్ని తుత్తునీయలు చేసింది. తర్వాత్తర్వాత పరుగులతో ఇన్నింగ్స్‌ను పేర్చేసింది. అటుపై కష్టాల నుంచి జట్టును గట్టెక్కించింది. ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి లొంగాల్సిన చోట భారీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. దీంతో పంత్‌ అవుటైనప్పటి ఆనందం ఆసీస్‌లో క్రమంగా ఆవిరైంది. ఓవర్లు గడిచేకొద్దీ... పరుగులు పెరిగేకొద్దీ... ఇద్దరు అర్ధశతకాలు బాదేసేదాకా సాగిపోయింది. ఇది భారత్‌ ఇన్నింగ్స్‌ను పటిష్టస్థితికి తీసుకెళ్లింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను నీరుగార్చేసింది. కమిన్స్‌ ఓవర్లో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో సిక్సర్‌ బాదిన శార్దుల్‌... బౌండరీలనైతే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. సుందర్‌ కూడా లయన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టాడు. ఇద్దరు చక్కని సమన్వయంతో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 300 మార్క్‌ను దాటింది. గబ్బాలో ఏడో వికెట్‌కు అత్యధికంగా 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక శార్దుల్‌ ఔటయ్యాడు. తర్వాత భారత్‌ ఇన్నింగ్స్‌ ఎంతో సేపు సాగలేదు. సైనీ (5), సిరాజ్‌ (13)లను హాజల్‌వుడ్‌ ... సుందర్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 369; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) స్టార్క్‌ (బి) లయన్‌ 44; శుబ్‌మన్‌ గిల్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 7; పుజారా (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 25; అజింక్య రహానే (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 37; మయాంక్‌ అగర్వాల్‌ (సి) స్మిత్‌ (బి) హాజల్‌వుడ్‌ 38; రిషభ్‌ పంత్‌ (సి) గ్రీన్‌ (బి) హాజల్‌వుడ్‌ 23; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) గ్రీన్‌ (బి) స్టార్క్‌ 62; శార్దుల్‌ ఠాకూర్‌ (బి) కమిన్స్‌ 67; నవదీప్‌ సైనీ (సి) స్మిత్‌ (బి) హాజల్‌వుడ్‌ 5; సిరాజ్‌ (బి) హాజల్‌వుడ్‌ 13; నటరాజన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (111.4 ఓవర్లలో ఆలౌట్‌) 336.
వికెట్ల పతనం: 1–11, 2–60, 3–105, 4–144, 5–161, 6–186, 7–309, 8–320, 9–328, 10–336. బౌలింగ్‌: స్టార్క్‌ 23–3–88–2, హాజల్‌వుడ్‌ 24.4–6–57–5, కమిన్స్‌ 27–5–94–2, గ్రీన్‌ 8–1–20–0, లయన్‌ 28–9–65–1, లబ్‌షేన్‌ 1–1–0–0.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: హారిస్‌ (బ్యాటింగ్‌) 1; డేవిడ్‌ వార్నర్‌ (బ్యాటింగ్‌) 20; మొత్తం (6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 21.
బౌలింగ్‌: సిరాజ్‌ 2–1–12–0, నటరాజన్‌ 3–0–6–0, వాషింగ్టన్‌ సుందర్‌ 1–0–3–0.

► అరంగేట్రం టెస్టులోనే మూడు వికెట్లు తీయడంతోపాటు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన పదో క్రికెటర్‌గా, భారత్‌ నుంచి మూడో  క్రికెటర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ గుర్తింపు పొందాడు. భారత్‌ నుంచి సుందర్‌కంటే ముందు దత్తూ ఫాడ్కర్‌ (1947లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో... 51 పరుగులు; 3/14), హనుమ విహారి (2018లో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో... 56 పరుగులు; 3/37) ఈ ఘనత సాధించారు.

 ► భారత్‌పై టెస్టుల్లో 33 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కడం ఆస్ట్రేలియాకిది మూడోసారి. గతంలో 33 పరుగుల ఆధిక్యం పొందిన రెండుసార్లూ ఆస్ట్రేలియా (1979లో కాన్పూర్‌; అడిలైడ్‌ 2003) ఆ టెస్టుల్లో ఓడిపోవడం గమనార్హం.

► ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్‌మన్‌ జోడీ ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది నాలుగోసారి. గతంలో రిషభ్‌ పంత్‌–రవీంద్ర జడేజా (204 పరుగులు; 2019లో సిడ్నీ)... విజయ్‌ హజారే–హేమూ అధికారి (132 పరుగులు; 1948లో అడిలైడ్‌)... అజహరుద్దీన్‌–మనోజ్‌ ప్రభాకర్‌ (101 పరుగులు; 1992లో అడిలైడ్‌) జోడీలు ఈ ఘనత సాధించాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top