సిరీస్‌పై భారత్‌ గురి | Second ODI match between India and Afghanistan today | Sakshi
Sakshi News home page

సిరీస్‌పై భారత్‌ గురి

Jun 17 2026 4:01 AM | Updated on Jun 17 2026 9:02 AM

Second ODI match between India and Afghanistan today

నేడు అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డే

మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

లక్నో: భారత్, అఫ్గానిస్తాన్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎకానా స్టేడియంలో నేడు జరిగే పోరులో ఇరు జట్ల తలపడనున్నాయి. వర్షం బారిన పడి సగం ఓవర్లకే గత మ్యాచ్‌ పరిమితం కాగా... ఈసారి పూర్తి స్థాయిలో ఆట జరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డేలో 7 వికెట్లతో నెగ్గిన భారత్‌ ఇక్కడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత్‌పై తొలి విజయాన్ని అందుకోవాలని అఫ్గాన్‌ ఆశిస్తోంది. అఫ్గాన్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు. 

ధర్మశాల వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్‌ మళ్లీ సత్తా చాటాలని అఫ్గాన్‌ టీమ్‌ ఆశిస్తోంది. అయితే 25 ఓవర్లే సాగిన తొలి మ్యాచ్‌లో కూడా బ్యాటర్లు నిలవలేకపోవడంతో జట్టు ఆలౌట్‌ అయింది. ఇప్పుడు పూర్తి స్థాయి వన్డేలో టీమ్‌ మరింత పట్టుదలగా ఆడాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో మరోసారి టీమ్‌ రషీద్‌ ఖాన్, ఘజన్‌ఫర్‌లపై ఆధారపడుతోంది. ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా కీలకం కానున్నాడు. 

భారత జట్టుకు సంబంధించి ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. పొడిగా ఉన్న పిచ్‌ పరిస్థితిని బట్టి చూస్తే ఒక పేసర్‌ స్థానంలో స్పిన్నర్‌కు చాన్స్‌ ఉంది. కాబట్టి ప్రసిధ్‌ కృష్ణకు బదులుగా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ టీమ్‌లోకి రావచ్చు. స్థానిక యూపీ ఆటగాడే కావడం కూడా కుల్దీప్‌కు సానుకూలాంశం. అయితే మ్యాచ్‌ ఫలితంకంటే కూడా మరోసారి రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ గురించే చర్చ జరగడం ఖాయం. 

వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రతీ మ్యాచ్‌ రోహిత్‌కు కీలకమే. తొలి వన్డేలో అతను దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను ఎన్ని పరుగులు చేస్తాడనేది ఆసక్తికరం. ఎకానా స్టేడియంలో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో ఐదు మ్యాచ్‌లు జరిగాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరిస్తూ భారీ, స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ గ్రౌండ్‌లో భారత్‌ 2 వన్డేలు ఆడగా, అఫ్గానిస్తాన్‌ 4 వన్డేలు ఆడటం విశేషం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement