Sanju Samson: టీమిండియాలో చోటు దక్కకపోతేనేం.. బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడుగా..!

Sanju Samson Earns Maiden BCCI Annual Contract - Sakshi

టీమిండియాలో సమీకరణలు, ఇతరత్రా  కారణాల చేత సరైన అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయిన టాలెంటెడ్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఎట్టకేలకు ఓ విషయంలో న్యాయం చేసింది. జట్టుకు ఎంపికైనా రకరకాల కారణాల చేత తుది జట్టులో అడే అవకాశాలను కోల్పోతున్న సంజూకు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చి తగిన గుర్తింపునిచ్చింది.

సంజూకు తొలిసారి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌  ఇచ్చిన బీసీసీఐ.. గ్రేడ్‌ సి కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో చోటు కల్పించింది. ఈ ఒప్పందం మేరకు సంజూకు రూ. కోటి వార్షిక వేతనం లభించనుంది. సంజూతో పాటు దీపక్‌ హుడా, కేఎస్‌ భరత్‌, అర్షదీప్‌ సింగ్‌లకు బీసీసీఐ తొలిసారి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. వీరిని కూడా బీసీసీఐ గ్రేడ్‌ సి కేటగిరిలో చేర్చింది. వీరికి కూడా ఏటా కోటి రూపాయల వేతనం లభించనుంది. 

తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో చాలా మార్పులు చేసిన బీసీసీఐ.. ఏ గ్రేడ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను ఏ ప్లస్‌ (7 కోట్లు) గ్రేడ్‌కు ప్రమోట్‌ చేయగా.. వరుస వైఫల్యాల బాట పట్టిన కేఎల్‌ రాహుల్‌ను ఏ గ్రేడ్‌ నుంచి బీ గ్రేడ్‌కు డిమోట్‌ చేసింది.

ఇటీవల ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్‌ పటేల్‌ను బీ గ్రేడ్‌ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోట్‌ చేసిన బీసీసీఐ.. వెటరన్‌ ఆటగాళ్లు ఆజింక్య రహానే, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌లను పూర్తిగా కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తప్పించింది. ఆశ్చర్యకరంగా ఏ ఫార్మాట్‌లో కూడా అవకాశాలు దక్కని మరో వెటరన్‌ ప్లేయర్‌ శిఖర్‌ ధవన్‌ బీసీసీఐతో సి గ్రేడ్‌ కాంట్రక్ట్‌ను నిలబెట్టుకున్నాడు. 

కాంట్రాక్ట్‌ జాబితా (మొత్తం 26 మంది)  
►‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. 
►‘ఎ’ గ్రేడ్‌ (రూ. 5 కోట్లు): హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌. 
►‘బి’ గ్రేడ్‌ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్‌ యాదవ్, శుబ్‌మన్‌ గిల్‌. 
►‘సి’ గ్రేడ్‌ (రూ. 1 కోటి): ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధావన్, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్‌ సింగ్, కోన శ్రీకర్‌ భరత్‌.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top