SRH vs RCB: అప్పగించేశారు

Royal Challengers Bangalore Beat Sunrisers Hyderabad By 6 Runs - Sakshi

గెలిచే మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఒత్తిడిలో చిత్తయిన బ్యాట్స్‌మెన్‌

వార్నర్‌ అర్ధ సెంచరీ వృథా

6 పరుగుల తేడాతో బెంగళూరు అద్భుత విజయం

ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఆర్‌సీబీ స్పిన్నర్‌ షహబాజ్‌ అహ్మద్‌

రాణించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయలక్ష్యం 150... 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 115/2... గెలవాలంటే 24 బంతుల్లో మరో 35 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. క్రీజులో బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే ఉన్నారు. జాగ్రత్తగా ఆడితేచాలు హైదరాబాద్‌ విజయతీరానికి చేరుకుంటుంది. కానీ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడికి లోనయ్యారు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్పిన్నర్‌ షహబాజ్‌ అహ్మద్‌ మాయాజాలంలో చిక్కుకున్నారు. అనవసర షాట్లు ఆడేశారు. ఒకరివెంట ఒకరు పెవిలియన్‌ చేరుకున్నారు. దాంతో హైదరాబాద్‌ చివరి ఏడు వికెట్లను 27 పరుగులకే కోల్పోయింది. విజయానికి దూరమైపోయింది. ఓటమి తప్పదనుకున్న బెంగళూరు జట్టు గెలుపుపై నమ్మకం కోల్పోకుండా చివరి వరకు ఆడి వరుసగా రెండో విజయం రుచి చూసింది.   

చెన్నై: ఐపీఎల్‌ తాజా సీజన్‌ మరో నాటకీయ మ్యాచ్‌కు వేదికైంది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ను పోలిన మ్యాచ్‌గా సాగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓటమి వరించగా... విజయ తీరాన్ని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) చేరింది. హైదరాబాద్‌ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేసినా... బ్యాటింగ్‌ వైఫల్యంతో సీజన్‌లో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓడింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మ్యాక్స్‌వెల్‌ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్సర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ ఆడగా... కెప్టెన్‌ కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ (3/30) కీలక వికెట్లు తీయగా... రషీద్‌ ఖాన్‌ (2/18) టి20 లో తన విలువేంటో మరోసారి చాటాడు. అనం తరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌ వార్నర్‌ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్సర్‌)... మనీశ్‌ పాండే (39 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లు షహబాజ్‌ అహ్మద్‌ (3/7), హర్షల్‌ పటేల్‌ (2/25), సిరాజ్‌ (2/25) హైదరాబాద్‌ను దెబ్బతీశారు.  

సూపర్‌ జోడీ...
సాధారణ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ సాహా (1) మరోసారి విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పాండే తాను ఎదుర్కొన్న తొలి ఐదు బంతులను ఆచితూచి ఆడాడు. అయితే జేమీసన్‌ వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతిని పాండే సిక్సర్‌గా మలిచాడు. అదే ఓవర్‌లో ఫోర్‌ కొట్టిన వార్నర్‌... చివరి బంతిని ఒంటి కాలి మీద నిలబడుతూ ఫైన్‌ లెగ్‌ మీదుగా కళాత్మకమైన సిక్సర్‌ను బాదాడు.

సిరాజ్, షహబాజ్‌ అహ్మద్‌ సంబరం

ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌ 50/1గా నిలిచింది. ఇక పేసర్లతో లాభం లేదనుకున్న కోహ్లి స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను రంగంలోకి దించాడు. అతడి ఓవర్‌లో మనీశ్‌ పాండే కొట్టిన సిక్సర్‌ స్టేడియం పైకప్పును తాకడం విశేషం. 12వ ఓవర్‌ తొలి బంతికి రెండు పరుగులు తీసిన వార్నర్‌ 31 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే 83 పరుగుల భాగస్వామ్యంతో దూసుకెళ్తున్న ఈ జోడికి జేమీసన్‌ కళ్లెం వేశాడు. భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో వార్నర్‌ లాంగాన్‌లో క్రిస్టియాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  

మలుపు తిప్పిన షహబాజ్‌ ఓవర్‌...
హైదరాబాద్‌ విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో ట్విస్ట్‌ మొదలయింది. 17వ ఓవర్‌ వేయడానికి వచ్చిన షహబాజ్‌ అహ్మద్‌ సాఫీగా సాగుతున్న హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో అలజడి రేపాడు. తొలి రెండు బంతులకు అనవసరపు షాట్‌లకు ప్రయత్నించిన బెయిర్‌స్టో (12), మనీశ్‌ పాండేలను అవుట్‌ చేయడంతోపాటు... చివరి బంతికి సమద్‌ (0)ను డకౌట్‌ చేశాడు. అంతేకాకుండా ఆ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్‌ చూసిన ప్రతి ఒక్కరికీ కోల్‌కతా, ముంబై మ్యాచే జ్ఞప్తికి వచ్చింది.

హైదరాబాద్‌ మరో కోల్‌కతా కానుందా అనే ఆలోచన సగటు సన్‌రైజర్స్‌ అభిమానిలో మెదిలింది. 18వ ఓవర్‌లో శంకర్‌ (3)ను హర్షల్‌ పటేల్‌ ... 19వ ఓవర్‌లో హోల్డర్‌ (4)ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో రైజర్స్‌ విజయానికి 16 పరుగులు అవసరం కాగా... హర్షల్‌  వేసిన ఈ ఓవర్లో రషీద్‌ (17), భువనేశ్వర్‌ (2 నాటౌట్‌) తొలి మూడు బంతులకు 8 పరుగులు సాధించారు. అయితే వరుస బంతుల్లో రషీద్, నదీమ్‌ (0) అవుట్‌ కావడంతో రైజర్స్‌ ఓటమి ఖాయమైంది.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) శంకర్‌ (బి) హోల్డర్‌ 33; పడిక్కల్‌ (సి) నదీమ్‌ (బి) భువనేశ్వర్‌ 11; షహబాజ్‌ అహ్మద్‌ (సి) రషీద్‌ (బి) నదీమ్‌ 14; మ్యాక్స్‌వెల్‌ (సి) సాహా (బి) హోల్డర్‌ 59; డివిలియర్స్‌ (సి) వార్నర్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 1; సుందర్‌ (సి) పాండే (బి) రషీద్‌ 8; క్రిస్టియాన్‌ (సి) సాహా (బి) నటరాజన్‌ 1; జేమీసన్‌ (సి) పాండే (బి) హోల్డర్‌ 12; హర్షల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1–19, 2–47, 3–91, 4–95, 5–105, 6–109, 7–136, 8–149.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–30–1, హోల్డర్‌ 4–0–30–3, నదీమ్‌ 4–0–36–1, నటరాజన్‌ 4–0– 32–1, రషీద్‌ ఖాన్‌ 4–0–18–2.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) సిరాజ్‌ 1; వార్నర్‌ (సి) క్రిస్టియాన్‌ (బి) జేమీసన్‌ 54; పాండే (సి) హర్షల్‌ (బి) షహబాజ్‌ అహ్మద్‌ 38; బెయిర్‌స్టో (సి) డివిలియర్స్‌ (బి) షహబాజ్‌ అహ్మద్‌ 12; సమద్‌ (సి అండ్‌ బి) షహబాజ్‌ అహ్మద్‌ 0; శంకర్‌ (సి) కోహ్లి (బి) హర్షల్‌ పటేల్‌ 3; హోల్డర్‌ (సి) క్రిస్టియాన్‌ (బి) సిరాజ్‌ 4; రషీద్‌ (రనౌట్‌) 17; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 2; నదీమ్‌ (సి) షహబాజ్‌ అహ్మద్‌ (బి) హర్షల్‌ 0; నటరాజన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143. 
వికెట్ల పతనం: 1–13, 2–96, 3–115, 4–115, 5–116, 6–123, 7–130, 8–142, 9–142.
బౌలింగ్‌: సిరాజ్‌ 4–1–25–1, జేమీసన్‌ 3–0–30–1, సుందర్‌ 2–0–14–0, చాహల్‌ 4–0–29–0, హర్షల్‌ 4–0–25–2, క్రిస్టియాన్‌ 1–0–7–0, షహబాజ్‌ 2–0–7–3.  

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ రాయల్స్‌ X ఢిల్లీ క్యాపిటల్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top