ఎవరి బౌలింగ్‌లో సిక్స్‌లు బాదడం ఇష్టం?.. రోహిత్‌ శర్మ ఆన్సర్‌ ఇదే | Rohit Sharma Reveals Which Bowler He Loves Hitting Sixes Against | Sakshi
Sakshi News home page

ఎవరి బౌలింగ్‌లో సిక్స్‌లు బాదడం ఇష్టం?.. రోహిత్‌ శర్మ ఆన్సర్‌ ఇదే

Aug 29 2025 6:16 PM | Updated on Aug 29 2025 6:51 PM

Rohit Sharma Reveals Which Bowler He Loves Hitting Sixes Against

రోహిత్‌ శర్మ (Rohit Sharma).. పవర్‌ హిట్టర్‌గా గుర్తింపు పొందిన అతికొద్ది మంది బ్యాటర్లలో ఒకడు. టీమిండియా ఓపెనర్‌గా, కెప్టెన్‌గా ఈ ముంబైకర్‌ ఇప్పటికే ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు సారథిగా పనిచేసిన రోహిత్‌.. 2024లో టీ20 ప్రపంచకప్‌, 2025లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాడు.

సిక్సర్ల వీరుడు
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. వన్డే, టీ20, టెస్టుల్లో కలిపి టీమిండియా తరఫున ఈ హిట్‌మ్యాన్‌.. 637 సిక్స్‌లు కొట్టాడు. అంతేకాదు వన్డేల్లో 93, అంతర్జాతీయ టీ20లలో 140కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన ఘనత రోహిత్‌ సొంతం.

ఇక గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ప్రస్తుతం వన్డేల్లో టీమిండియా సారథిగా కొనసాగుతున్న హిట్‌మ్యాన్‌.. ఐపీఎల్‌ ముంబై తరఫున పొట్టి క్రికెట్‌లోనూ అలరిస్తున్నాడు.

ఎవరో ఒక్కరినే టార్గెట్‌ చేయను
కాగా ఇటీవల రోహిత్‌ శర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇందులో భాగంగా.. ‘‘మీకు ఎవరి బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం ఇష్టం?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రోహిత్‌ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.

‘‘ప్రతి బౌలర్‌ బౌలింగ్‌లోనూ సిక్సర్లు బాదడం నాకిష్టం. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరైనా సరే.. హిట్టింగ్‌ చేయాలనే మైండ్‌సెట్‌తో ఉంటాను. అంతేగానీ.. ఎవరో ఒక్కరినే టార్గెట్‌ చేసి నేనైతే సిక్సర్లు బాదను’’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

ధనాధన్‌.. ఫటాఫట్‌
కాగా టీమిండియా తరఫున 67 టెస్టులు, 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4301, 4231 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 88, టీ20లలో 205 సిక్సర్లు బాదాడు. 

ఇక 38 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఇప్పటికి 272 వన్డేలు పూర్తి చేసుకుని.. 11168 రన్స్‌ రాబట్టాడు. ఇందులో 344 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో మూడుసార్లు డబుల్‌ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌ కూడా రోహిత్‌ శర్మనే!.. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) అతడి పేరిటే ఉంది.

ఐపీఎల్‌ వీరుడు
ఐపీఎల్‌లోనూ రోహిత్‌ శర్మకు ఘనమైన రికార్డు ఉంది. సారథిగా ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబైకర్‌.. క్యాష్‌ రిచ్‌లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

ఇక ఇప్పటికి 272 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ.. 7046 పరుగులు సాధించాడు. ఇందులో 47 హాఫ్‌ సెంచరీలు, రెండు శతకాలు ఉన్నాయి. అదే విధంగా ఐపీఎల్‌లో రోహిత్‌ బాదిన సిక్సర్ల సంఖ్య 302.

చదవండి: ఐపీఎల్‌ ‘ముడేసిన బంధం’.. అప్పుడే ప్రేమ బయటపడింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement