Kohli-Ricky Ponting: 'మూడేళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉంటే..'

Ricky Ponting On-Whether Virat Kohli Surpass Sachin Tendulkar 100-Tons - Sakshi

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వంద సెంచరీల రికార్డును అందుకోవడం ఇప్పట్లో కష్టమే. కానీ ఆ ఫీట్‌ను అందుకునే అవకాశం మాత్రం ఈ తరంలో ఒక్కడికే ఉంది. అతనెవరో కాదు.. టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి. కోహ్లి ఖాతాలో 71 సెంచరీలు ఉన్నప్పటికి.. సచిన్‌ రికార్డు బద్దలు కొంటాలంటే మరో 30 సెంచరీలు చేయాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడున్న ఫామ్‌ దృష్యా కోహ్లికి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వింటేజ్‌ కోహ్లిని చూసి చాలా కాలమైపోయింది. ఇటీవలే ఆసియా కప్‌లో అఫ్గనిస్తాన్‌పై టి20ల్లో తొలి సెంచరీ.. మొత్తంగా 71వ సెంచరీ సాధించినప్పటికి.. కోహ్లి ఫామ్‌పై కొంత అనుమానం మిగిలే ఉంది. ఆసియా కప్‌లో చూపించిన ఫామ్‌ను కోహ్లి రాబోయే మ్యాచ్‌ల్లో చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. 33 ఏళ్ల వయసున్న కోహ్లి.. మరో నాలుగైదేళ్లు క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. కానీ ఈ నాలుగేళ్లలో అతను సచిన్‌ వంద సెంచరీల రికార్డును అందుకోగలడా అనేది సందేహంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ కోహ్లి వంద సెంచరీల రికార్డును బద్దలు కొడతాడా అనేదానిపై ఆసక్తికరంగా స్పందించాడు. ''మూడేళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉంటే కచ్చితంగా సాధించేవాడని చెప్పేవాడిని. కానీ కోహ్లి ఇప్పుడు కాస్త నెమ్మదించాడు. కోహ్లి సచిన్‌ను అధిగమించాలంటే మరో 30 సెంచరీలు చేయాల్సి ఉంది. ఇది కాస్త కష్టమైనప్పటికి కోహ్లికి సచిన్‌ వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఇంకా ఉంది.

ఇందులో ఎలాంటి అనుమానం లేదు.  కోహ్లి వయసు 33 ఏళ్లు.. మరో నాలుగైదేళ్లు అతనిలో క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. ఇప్పటికి 71 శతకాలు సాధించాడు. అతను రికార్డులు సాధిస్తాడని చెప్పలేం.. ఎందుకంటే ఎన్ని రికార్డులు సాధించినా అతని దాహం తీరనిదే.'' అంటూ పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: 'అలా అనుకుంటే ఎవరు పర్‌ఫెక్ట్‌గా లేరు.. ఇప్పుడేంటి?'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top