ఖరీదైన 6 బెడ్‌ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్‌.. ధర ఎంతో తెలుసా..?

Ricky Ponting Spends 20 Million Dollars Swanky Mansion - Sakshi

ఆస్ట్రేలియా మాజీ సారధి, టూ టైమ్‌ వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ శివారు ప్రాంతమైన టూరక్‌లో అత్యంత విలాసవంతమైన 6 బెడ్‌ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేశాడు. లగ్జరీ స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు టెన్నిస్ కోర్ట్ కలిగిన ఈ మాన్షన్‌ ఖరీదు 20 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. 

1400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలరాతిచే నిర్మించబడ్డ ఈ అత్యధునిక విల్లాలో ఇండోర్-అవుట్‌డోర్ లివింగ్ స్పేస్‌లతో పాటు ఆధునిక వంటగది సమకూర్చబడింది. పాంటింగ్‌ ఇంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2013లో ఈ ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ 9.2 మిలియన్ డాలర్లు వెచ్చించి బ్రైటన్‌లోని బీచ్‌సైడ్ శివారులో ఓ లగ్జరీ మ్యాన్షన్‌ను కొన్నాడు.

ప్రస్తుతం పాంటింగ్‌ కుటంబంతో కలిసి అందులోనే నివాసం ఉంటున్నాడు. బ్రైటన్ గోల్డెన్ మైల్‌గా పిలవబడే ఆ సుందర భవనంలో 7 పడక గదులు, ఎనిమిది స్నానపు గదులు, అంతర్గత థియేటర్ మరియు బీచ్‌కి ప్రైవేట్ లేన్‌వే ఉన్నాయి.

ఈ రెండు భవనాలే కాక పాంటింగ్‌ 2019లో మరో భవనాన్ని కూడా కొనుగోలు చేశాడు. దాని ఖరీదు 3.5 మిలియన్ డాలర్లు. ఇందులో నాలుగు పడక గదులు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఈ విల్లా పోర్ట్‌ వ్యూ కలిగి ఉం‍టుంది. 

ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పాం‍టింగ్‌.. ఆస్ట్రేలియా తరఫున 168 టెస్ట్ మ్యాచ్‌ల్లో  51.85 సగటున 41 సెంచరీల సాయంతో 13,378 పరుగులు చేశాడు. 374 వన్డేల్లో 41.81 సగటున 29 సెంచరీల సాయంతో 13,589 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top