ఇషాన్ కిషన్‌తో సూర్య (PC: BCCI)
భారత టీ20 జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్ రానున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటన తర్వాత యాజమాన్యం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు ఇటీవల వెల్లడించడం ఇందుకు కారణం.
వేటు తప్పదనే సంకేతాలు
టీమిండియాకు 2026లో కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం తేలిపోయాడు సూర్యకుమార్ యాదవ్. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాటింగ్‌లో పస లేకుండా పోయింది. ఇక ఐపీఎల్-2026లోనూ ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 270 పరుగులే చేయగలిగాడు.
ఈ నేపథ్యంలో సూర్యపై వేటు పడటం దాదాపుగా ఖాయమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ మాత్రం భిన్నంగా స్పందించాడు. క్రిక్‌బజ్‌కు రాసిన కాలమ్‌లో..
అత్యంత విలువైన ఆటగాడు
‘‘ఆధునిక టీ20 క్రికెట్‌లో కేవలం టెక్నిక్ ద్వారానే మ్యాచ్‌లు గెలవలేము. భయం లేకుండా వినూత్న షాట్లు కొట్టడం, కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉండటం అత్యంత ముఖ్యం. ఆ లక్షణాలన్నీ సూర్యకుమార్‌లో ఉన్నాయి.
అందుకే భారత టీ20 క్రికెట్‌లో ఇప్పటికీ అతడు అత్యంత విలువైన ఆటగాడే. అతడి ఫామ్ గురించి ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే. అయితే, భారత టీ20 జట్టు నుంచి సూర్యను తొలగిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు.
భవిష్య కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!
ఇప్పటికీ టీమిండియాలో విభిన్న, అత్యంత ప్రత్యేకమైన బ్యాటర్ సూర్యనే. 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడగల అతి కొద్దిమంది బ్యాటర్లలో అతడు ఒకడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం కష్టం’’ అని ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ పేర్కొన్నాడు.
ఇక సూర్యను ఆటగాడిగా కొనసాగించాలన్న ఎమ్‌ఎస్‌కే ప్రసాద్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్-2026 తర్వాత 2028 ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని 35 ఏళ్ల సూర్య తెలిపిన సంగతి తెలిసిందే.
చదవండి: కోహ్లికి షాక్.. వైభవ్‌కు చోటు!


