కోహ్లీకి షాక్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు! | Ex CSK Star Picks IPL Best Playing XI, Vaibhav Sooryavanshi Picked Over Kohli, Read Story For More Details | Sakshi
Sakshi News home page

కోహ్లీకి షాక్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు!

May 26 2026 10:32 AM | Updated on May 26 2026 11:23 AM

Ex-CSK Star Picks IPL-Best XII-Vaibhav Sooryavanshi Picked Over-Kohli

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే సీజ‌న్ ముగియ‌కముందే మాజీ క్రికెట‌ర్ సుబ్ర‌మ‌ణ్యం బ‌ద్రీనాథ్ త‌న బెస్ట్‌ ప్లేయింగ్ ఎలెవెన్ జ‌ట్టును ప్ర‌క‌టించాడు. 

అయితే ఈ జ‌ట్టులో ఆర్సీబీ స్టార్‌ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి చోటు ద‌క్క‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఊహించిన‌ట్లుగానే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చిచ్చ‌రపిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీకి స్థానం ద‌క్కింది. ఓపెనింగ్‌లో వైభ‌వ్‌కు జంట‌గా గుజ‌రాత్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక చేసిన బ‌ద్రీనాథ్ కీల‌క‌మైన మూడో స్థానానికి కోహ్లీని కాద‌ని ఈ సీజ‌న్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్ సాయి సుదర్శ‌న్‌కు చోటు క‌ల్పించాడు.

మిడిలార్డ‌ర్‌లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్‌హెచ్‌), ర‌జ‌త్ ప‌టీదార్ (ఆర్సీబీ), ఆల్‌రౌండ‌ర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్న‌ర్‌గా కేకేఆర్‌కు చెందిన సునీల్ న‌రైన్‌కు చోటు క‌ల్పించిన బ‌ద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయ‌డం విశేషం. 

ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువ‌నేశ్వ‌ర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చ‌ర్ (రాజ‌స్తాన్‌), క‌గిసో ర‌బాడ (గుజ‌రాత్ టైటాన్స్‌)ల‌ను ఎంచుకున్నాడు. మ‌రో పేస‌ర్ స్థానానికి యువ బౌల‌ర్లు ప్రిన్స్ యాద‌వ్‌, కార్తిక్ త్యాగిల‌ను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ 500 ప‌రుగుల మార్క్‌ను దాటాడు. 

కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఇక ఓపెన‌ర్లుగా ఎంపికైన వైభ‌వ్ సూర్య‌వంశీ (14 మ్యాచ్‌ల్లో 583 ప‌రుగులు), శుబ్‌మ‌న్ గిల్ (14 మ్యాచ్‌ల్లో 616 ప‌రుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీల‌క బౌల‌ర్‌గా ఉన్న భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, గుజ‌రాత్‌కు చెందిన ర‌బాడ చెరో 24 వికెట్ల‌తో పర్పుల్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నారు.

ఇక బ‌ద్రీనాథ్ టీమిండియా త‌ర‌ఫున రెండు టెస్టులు, ఏడు వ‌న్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లాడిన బ‌ద్రీనాథ్ 1441 ప‌రుగులు సాధించాడు.

బద్రీనాథ్ బెస్ట్‌ ప్లేయింగ్ ఎలెవెన్‌:
వైభవ్ సూర్యవంశీ, శుబ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.

చదవండి: విండీస్‌తో సిరీస్‌.. లంక జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌!

Advertisement
 
Advertisement
Advertisement