రంజీ ట్రోఫీ 2025-26లో (Ranji Trophy) భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు దీపక్ హుడా (Deepak Hooda) సెంచరీతో కదంతొక్కాడు. 159 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 121 పరగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
హుడా సెంచరీ సాయంతో రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. దీపక్ హుడాకు జతగా కార్తిక్ శర్మ (26) క్రీజ్‌లో ఉంది.
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (41) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. అభిజీత్ తోమర్ 14, కునాల్ సింగ్ 31 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం రాజస్థాన్ 85 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది
రాణించిన జైస్వాల్
అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (67), ముషీర్ ఖాన్ (49) రాణించగా.. మిడిలార్డర్ విఫలమైంది. రహానే 3, సిద్దేశ్ లాడ్ 8, సర్ఫరాజ్ ఖాన్ 15, ఆకాశ్ ఆనంద్ 5 పరుగులకు ఔటయ్యారు.
లోయర్డార్ ఆటగాళ్లలో షమ్స్ ములానీ (32), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (18), హిమాన్షు సింగ్ (25), తుషార్ దేశ్‌పాండే (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో కుక్నా సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఆశోక్ శర్మ 3, అనికేత్ చౌదరీ, ఆకాశ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.


