షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్‌! భువీ కూడా తగ్గేదేలే.. 5 వికెట్లు కూల్చి

Ranji Trophy 2024 Bhuvneshwar Kumar Claims 5 After UP Bowled Out For 60 - Sakshi

Ranji Trophy 2023-24: టీమిండియా వెటరన్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రంజీ ట్రోఫీ-2024 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఈ రైటార్మ్‌ పేసర్‌ తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో శుక్రవారం బెంగాల్‌తో మొదలైన టెస్టులో భువీ అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అరవై పరుగులకే ఆలౌట్‌ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్న యూపీ జట్టుకు కాస్త ఊరట చేకూరేలా తన బౌలింగ్‌ నైపుణ్యాలతో బెంగాల్‌ జోరుకు అడ్డుకట్ట వేశాడు.

మహ్మద్‌ కైఫ్‌నకు నాలుగు వికెట్లు
కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగాల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ మనోజ్‌ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి దెబ్బకు యూపీ కేవలం 20.5 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 60 పరుగుల వద్దే చాపచుట్టేసింది.

బెంగాల్‌ బౌలర్లలో పేసర్‌ మహ్మద్‌ కైఫ్‌(టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ తమ్ముడు) అత్యధికంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. సూరజ్‌ సింధు జైస్వాల్‌ మూడు, ఇషాన్‌ పోరెల్‌ రెండు వికెట్లు పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్‌ సమర్థ్‌ సింగ్‌ 13 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం గమనార్హం.

భువీ కూడా తగ్గేదేలే
ప్రత్యర్థిని అల్ప స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బెంగాల్‌కు భువీ వరుస షాకులు ఇచ్చాడు. ఈ యూపీ బౌలర్‌ దెబ్బకు ఓపెనర్‌ సౌరవ్‌ పాల్‌ 13, సుదీప్‌ కుమార్‌ ఘరామి 0, అనుస్తుప్‌ మజుందార్‌ 12, మనోజ్‌ తివారి 3, అభిషేక్‌ పోరెల్‌ 12 పరుగులకే పరిమితమయ్యారు. 

ఇలా మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్‌ బ్యాటర్లు శ్రేయాన్ష్‌ ఘోష్‌ 37, కరణ్‌ లాల్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్‌ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

అన్న షమీ బాటలో తమ్ముడు
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ షమీకి దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో బెంగాల్‌ తరఫున ఎంట్రీ ఇచ్చిన అతడు.. టీమిండియా స్టార్‌ పేసర్‌ స్థాయికి ఎదిగాడు. అన్న బాటలోనే నడుస్తున్న తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌ సైతం ప్రస్తుతం బెంగాల్‌కే ఆడుతున్నాడు.

ఇలా ఈరోజు అతడు అత్యుత్తమ ప్రదర్శనతో తన సొంత రాష్ట్రానికి చెందిన యూపీ జట్టును 60 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. మరోవైపు.. చాలా కాలంగా టీమిండియాకు దూరమైన భువనేశ్వర్‌ కుమార్‌ మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి​ చేస్తున్నాడు.

కానీ.. జస్‌ప్రీత్‌ బుమ్రా నాయకత్వంలోని పేస్‌ దళంలో షమీ, మహ్మద్‌ సిరాజ్ వంటి సీనియర్లు.. అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌ వంటి జూనియర్లు జట్టులో పాతుకుపోవడంతో భువీకి మొండిచేయే ఎదురవుతోంది. అయితే, తాజా రంజీ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. 
చదవండి: IND Vs AFG: రోహిత్‌ రనౌట్‌.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top