
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నాడు. అతను మూడు నెలలుగా వాడని ఓ ఫోన్ నంబర్‌ను ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన మనీశ్ అనే కుర్రాడికి కేటాయించారు (ఆపరేటర్).
మనీశ్ సిమ్ యాక్టివేట్ చేసుకోగానే వాట్సప్ డీపీపై రజత్ పాటిదార్ ఫోటో వచ్చింది. అనంతరం అతనికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, మరికొంత మంది ఆర్సీబీ ఆటగాళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి.
స్టార్ క్రికెటర్ల నుంచి ఫోన్లు రావడాన్ని ప్రాంక్ అనుకున్న మనీశ్.. వారికి అదే రీతిలో సమాధానం చెప్పాడట. నేను కోహ్లిని మాట్లాడుతన్నాను అంటే నేను టెండూల్కర్‌ని చెప్పు అని ఆ కుర్రాడు సమాధానం చెప్పాడట. ఏబీడీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట.
చిన్నగా విషయం పాటిదార్‌కు తెలియడంతో అతను మనీశ్‌ను సంప్రదించాడు. సిమ్ కార్డును తిరిగి ఇచ్చేయమని అడిగాడు. ఇది కూడా ప్రాంకే అని భావించిన ఆ యువకుడు నేను ధోనిని అంటూ పాటిదార్ మాటను దాటవేశాడట. మనీశ్‌కు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పాటిదార్ చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల రంగప్రవేశంలో మనీశ్ విషయాన్ని గ్రహించి సిమ్‌ను పాటిదార్‌కు తిరిగి ఇచ్చేశాడు. తాను నిజంగానే కోహ్లితో మాట్లాడానని తెలిసి మనీశ్ ఉబ్బితబ్బిబవుతున్నాడు. కోహ్లీతో మాట్లాడాను, నమ్మలేకపోతున్నాను అంటూ ఓ టీవీ ఛానెల్‌తో చెప్పాడు.
కోహ్లి కల నెరవేర్చిన పాటిదార్
పాటిదార్ ఐపీఎల్‌లో కోహ్లి 18 ఏళ్ల కలను నెరవేర్చాడు. ఈ ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాటిదార్ ఆర్సీబీకి అందని ద్రాక్షగా ఉండిన ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. పాటిదార్ త్వరలో ప్రారంభం కాబోయే దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.