
క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత స్టార్ షట్లర్
పారిస్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఆరో పతకం సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో సింధు పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 14–21, 21–13, 16–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ పుత్రి కుసుమవర్దిని (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సింధు గెలిచి ఉంటే సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకునేది.
గతంలో సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు (స్వర్ణం–2019, రెండు రజతాలు–2017, 2018, రెండు కాంస్యాలు–2013, 2014) సాధించింది. గతంలో కుసుమవర్దినిపై రెండుసార్లు గెలుపొంది, రెండుసార్లు ఓడిపోయిన సింధుకు ఐదోసారి పరాజయమే ఎదురైంది. 64 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు ఆటతీరులో నిలకడ కనిపించలేదు. తొలి గేమ్‌లో స్కోరు 6–6 వద్ద కుసుమవర్దిని చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో సింధు పుంజుకుంది. స్కోరు 4–3 వద్ద సింధు విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 10–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత మూడు పాయింట్లు కోల్పోయిన సింధు... 10–6 వద్ద మళ్లీ చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 16–6తో పది పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అదే క్రమంలో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒత్తిడికి లోనైంది. స్కోరు 5–4 వద్ద 59 షాట్‌ల ర్యాలీలో కుసుమవర్దిని షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో పాయింట్ నెగ్గిన సింధు 6–4తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే ఈ స్వల్ప ఆధిక్యాన్ని సింధు కాపాడుకోలేకపోయింది. స్కోరును 7–7 వద్ద సమం చేసిన కుసుమవర్దిని... ఆ తర్వాత స్కోరు 12–11 వద్ద ఇండోనేసియా ప్లేయర్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఒకదశలో సింధు తేరుకొని ఆధిక్యం అంతరాన్ని ఒక పాయింట్‌కు తగ్గించినా స్కోరు 17–16 వద్ద కుసుమవర్దిని అద్భుత ఆటతీరుతో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి విజయాన్ని అందుకుంది.
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ 15–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ చెన్ టాంగ్ జియె–తో ఈ వె (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది.