Russia-Ukraine War: ర‌ష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొల‌గింపు

Putin Loses Honorary Black Belt By World Taekwondo Amid Russia Ukraine War - Sakshi

Putin Loses Honorary Black Belt By World Taekwondo: ఉక్రెయిన్‌పై దాడుల‌ నేపథ్యంలో క్రీడారంగానికి సంబంధించి ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వరుస షాక్‌లు తగుతున్నాయి. ఇప్ప‌టికే అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్ష పదవిని కోల్పోయిన పుతిన్‌కు తాజాగా వరల్డ్‌ తైక్వాండో ఫెడరేషన్‌ షాకిచ్చింది. రష్యా అధ్యక్షుడికి అందించిన‌ గౌరవ తైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను తొల‌గించింది.

అలాగే రష్యా, బెలారస్‌లో ఎటువంటి తైక్వాండో ఈవెంట్‌లను నిర్వహించ‌బోమ‌ని అధికారికంగా వెల్ల‌డించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రకటిస్తూ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. కాగా, 2013 నవంబర్‌లో తైక్వాండో సమాఖ్య పుతిన్‌కు గౌరవ 9వ డాన్ బ్లాక్ బెల్ట్‌ను అందించింది. 

ఇదిలా ఉంటే, ప్రముఖ ఫుట్‌బాల్ సంస్థలు ఫిఫా, UEFA రష్యా జాతీయ జట్టుతో పాటు ఆ దేశ క్లబ్‌లను పోటీల నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరగాల్సిన యూరోపియన్ ఫుట్‌బాల్‌ లీగ్ ఫైనల్‌ను యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసింది. 

కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఉక్రెయిన్‌పై యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఒక వైపు చర్చలకు సిద్ధమంటూనే.. రష్యా దళాలు భీకర దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో వందల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో రష్యా కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు యావత్‌ క్రీడాలోకం మద్దతుగా నిలుస్తోంది.
చదవండి: పుతిన్‌కు జూడో ఫెడరేషన్ షాక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top