
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థలో పలు మార్పులను ఆశిస్తూ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ పాలసీ (ఎన్‌ఎస్‌పీ) బిల్‌కు ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. త్వరలోనే చట్టంగా మారనున్న ఈ బిల్లుతో క్రీడా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇచ్చిన ప్రసంగంలో ఆయన భారత క్రీడల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘అభివృద్ధిలో క్రీడలు కూడా ఒక భాగం. ఒకప్పుడు ఆటలు ఆడితే తల్లిదండ్రులు కోప్పడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రోత్సహించే వరకు పరిస్థితి మారడం సంతోషంగా ఉంది. ఇది మంచి సంకేతం. భారతీయ కుటుంబాల్లో క్రీడలు కూడా అంతర్భాగం కావడం నాకు గర్వంగా అనిపిస్తోంది. భారత భవిష్యత్తుకు కూడా ఇది చాలా మంచిది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్తగా అమల్లోకి రాబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలో పలు మార్పులకు శ్రీకారం చుడుతుందని, జవాబుదారీతనం పెంచుతుందని ఆయన అన్నారు.
‘క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకే పలు దశాబ్దాల తర్వాత కొత్త పాలసీని తీసుకొచ్చాం. పాఠశాలలనుంచి ఒలింపిక్స్ వరకు ఇది ఆటలను అభివృద్ధి చేసేలా ఉంటుంది. కోచింగ్, ఫిట్‌నెస్, మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి ఒక వ్యవస్థను దీని ద్వారా రూపొందిస్తున్నాం. ఇది దేశంలోని మారుమూలలకు వెళ్లి పని చేస్తుంది’ అని మోదీ స్పష్టం చేశారు. ఫిట్‌నెస్, క్రీడల ప్రాధాన్యత గురించి వివరిస్తూ ప్రధాని... ప్రస్తుతం దేశంలో ఊబకాయం అతి పెద్ద సమస్యగా మారిందని, దీనిలో మార్పుల తేవాలంటే నూనెల వినియోగాన్ని తక్కువ చేయాలని సూచించారు.