స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pak vs SA 1st T20I)కు చేదు అనుభవం ఎదురైంది. తొలి టీ20 మ్యాచ్‌లో పాక్.. పర్యాటక జట్టు చేతిలో ఏకంగా 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకుంది.
సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకురాలేము
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బ్యాటింగ్‌లో శుభారంభమే అందుకున్నాం. కానీ దానిని కొనసాగించలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది.
ఈ లోపాన్ని మేము అధిగమించాలి. బ్యాటింగ్ బాగుంటేనే అంతా బాగుంటుంది. మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అసవరం ఉంది. అలా అని సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకురాలేము.
ఆరంభంలో అస్సలు బాగాలేదు
ఇక ఈ మ్యాచ్‌లో బంతితోనూ మేము రాణించలేకపోయాం. ముఖ్యంగా పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు ఇచ్చాము. మా బౌలింగ్ ఆరంభంలో అస్సలు బాగాలేదు. అయితే, మధ్య ఓవర్లలో పొదుపుగా బౌల్ చేయడం సానుకూలాంశం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.
కాగా రెండు టెస్టులు, మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ముగియగా.. ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో సమం చేసుకున్నాయి. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా మంగళవారం రాత్రి టీ20 సిరీస్ ఆరంభమైంది.
దంచికొట్టిన ఓపెనర్లు
టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 194 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రీజా హెండ్రిక్స్ (40 బంతుల్లో 60), క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23) దంచికొట్టారు. వన్‌డౌన్‌లో వచ్చిన టోనీ డి జార్జ్ (16 బంతుల్లో 33), ఏడో నంబర్ బ్యాటర్ జార్జ్ లిండే (22 బంతుల్లో 36) మెరుపులు మెరిపించారు.
పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ మూడు వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్ రెండు, షాహిన్ ఆఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్ శుభారంభమే అందుకుంది.
చెలరేగిన సఫారీ బౌలర్లు
ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (19 బంతుల్లో 24), సయామ్ ఆయుబ్ (28 బంతుల్లో 37) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే, రీఎంట్రీలో బాబర్ ఆజం డకౌట్ కాగా.. కెప్టెన్ సల్మాన్ ఆఘా (2) పూర్తిగా నిరాశపరిచాడు.
ఆఖర్లో మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 36) కాసేపు మెరుపులు మెరిపించినా.. ప్రొటిస్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. పాక్‌కు ఓటమి తప్పలేదు.
సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. జార్జ్ లిండే మూడు, లిజాడ్ విలియమ్స్ రెండు, లుంగీ ఎంగిడీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇరుజట్ల మధ్య శుక్రవారం (అక్టోబరు 31) జరిగే మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదిక.
చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?


