‘అతడిని ఎంపిక చేయకపోతే టీమిండియాకే నష్టం’ | Our Loss Not His: R Ashwin's Big Shreyas Iyer Warning To Agarkar | Sakshi
Sakshi News home page

‘అతడిని ఎంపిక చేయకపోతే టీమిండియాకే నష్టం’

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:46 AM

Our Loss Not His: R Ashwin's Big Shreyas Iyer Warning To Agarkar

ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని శ్రేయస్‌ సేన.. తాజాగా ముంబై ఇండియన్స్‌పై జయభేరి మోగించింది. వాంఖడే వేదికగా ముంబైని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగో విజయం నమోదు చేసింది.

పంజాబ్‌ గెలుపులో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ముంబై విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 35 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి శ్రేయస్‌ అయ్యర్‌ 203 పరుగులు సాధించాడు.

సారథిగా, బ్యాటర్‌గా సూపర్‌హిట్‌
గతేడాది కూడా పంజాబ్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా పదిహేడు మ్యాచ్‌లలో కలిపి 604 రన్స్‌ చేయడంతో పాటు.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతకు ముందు దేశీ క్రికెట్‌లో ముంబై తరఫునా అదరగొట్టాడు. అయినప్పటికీ 2023 తర్వాత మళ్లీ అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు.

ఆటతోనే అందరికీ సమాధానం
ఈ పరిణామాల నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే నష్టపోయేది టీమిండియానే అని అన్నాడు. ఈ మేరకు.. ‘‘శ్రేయస్‌ తన ఆటతోనే అందరికీ సమాధానం చెబుతున్నాడు. అతడి ప్రతిభ ఏమిటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు.

అతడు షార్ట్‌ బాల్‌ను సరిగ్గా ఎదుర్కోలేడంటూ తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, ముంబైతో మ్యాచ్‌లో అతడు జస్‌ప్రీత్‌ బుమ్రాను ఎలా ఎదుర్కొన్నాడో అందరూ చూశారు కదా!.. షార్ట్‌ బాల్‌నే మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. అంతకు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో రాణించాడు.

ఇంకెన్నిసార్లు
ఇంకెన్నిసార్లు అతడు తనను తాను నిరూపించుకోవాలి? శ్రేయస్‌ లాంటి క్రికెటర్లను చూస్తే నాకెంతో ఆదర్శంగా ఉంటుంది. స్పిన్‌ బౌలింగ్‌లో హిట్టింగ్‌ ఆడుతున్నాడు. షార్ట్‌ బాల్‌ బలహీనతను అధిగమించాడు. గత రెండేళ్లుగా అతడి స్ట్రైక్‌రేటు కూడా 170కి పైగా ఉంది.

ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో 300కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబడుతున్నాడు. మంచి బంతి కోసం ఎదురుచూడటం కాదు.. వాళ్లపై అటాకింగ్‌కు దిగుతూ పైచేయి సాధిస్తున్నాడు. అత్యద్భుతంగా ఆడినా సరే అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదు?

టీమిండియాకే నష్టం
శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం వల్ల.. అతడి కంటే జట్టుకే ఎక్కువ నష్టం. అతడిని నాయకత్వ బృందంలో భాగం చేయకపోవడం కచ్చితంగా జట్టుకు నష్టదాయకం’’ అని అశ్విన్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తీరును విమర్శించాడు. 

కాగా ఆసియా కప్‌-2025కి ముందు అయ్యర్‌ గురించి మాట్లాడుతూ... జట్టులో ఖాళీ లేనందు వల్లే అతడిని పక్కనపెట్టామని అగార్కర్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగింట గెలిచి అగ్రస్థానానికి దూసుకువచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ మాత్రం వర్షం వల్ల రద్దైపోయింది.

చదవండి: ‘ఓటములకు ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము’

Advertisement
 
Advertisement
Advertisement