‘ఓటములకు అతడిని బాధ్యుడిని చేయలేము’ | Hardik Pandya Under Fire Over MI Winless Run Coach Jayawardene Responds | Sakshi
Sakshi News home page

‘ఓటములకు ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము’

Apr 17 2026 8:55 AM | Updated on Apr 17 2026 9:10 AM

Hardik Pandya Under Fire Over MI Winless Run Coach Jayawardene Responds

ముంబై కోచ్‌ జయవర్దనె (PC: BCCI/IPL)

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో హార్దిక్‌ సేన ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదింట నాలుగో పరాజయం నమోదు చేసింది.

హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)పై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో తేలిపోవడంతో జట్టుపై ప్రభావం పడింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులే చేసి మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఇక బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసిన పాండ్యా.. 39 పరుగులు ఇచ్చుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాపై విమర్శల దాడి పెరగగా.. హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనె మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ సీజన్‌లో ముంబై ఓటములకు కేవలం హార్దిక్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదన్నాడు.

ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము
పంజాబ్‌ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం హార్దిక్‌ పాండ్యా వైఫల్యం మాత్రమే కాదు. మా సమిష్టి వైఫల్యం. జట్టుగా విఫలమైనపుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను... నాయకత్వ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు, యాజమాన్యం మొత్తం ఇందుకు బాధ్యత వహిస్తుంది.

వ్యక్తిగతంగా ఎవరినీ బాధ్యులను చేయలేము. ఇకపై ఆటను మెరుగు పరచుకోవడం ఎలా అన్న అంశం మీద మాత్రమే మేము ప్రస్తుతం దృష్టి సారించాము’’ అని మహేళ జయవర్దనె హార్దిక్‌ పాండ్యాకు అండగా నిలిచాడు.

తమ జట్టు బాగానే ఆడుతోందని.. అయితే, పూర్తి స్థాయిలో రాణించి ఫలితాన్ని రాబట్టలేకపోతుందని ఈ సందర్భంగా జయవర్దనె కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగిలిన జట్లు మాత్రం అత్యద్భుతంగా ఆడుతూ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నాడు.

ప్రభ్‌సిమ్రన్‌,శ్రేయస్‌ మెరుపులు
కాగా వాంఖడే వేదికగా టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేయగా.. ముంబై బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనింగ్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అజేయ సెంచరీ (60 బంతుల్లో 112)తో చెలరేగగా.. నమన్‌ ధిర్‌ అర్ధ శతకం (50) బాదాడు.

లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 16.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (39 బంతుల్లో 80 నాటౌట్‌) దుమ్ములేపగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ (35 బంతుల్లో 66) ఆడాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా ముంబై విధించిన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది.

చదవండి: శ్రేయ‌స్ స్టన్నింగ్ క్యాచ్‌.. షాకైన‌ రోహిత్‌, సూర్య‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement