
క్రీడల నిర్వహణలోనే కాదు... పోటీల ప్రారంబోత్సవంలో కూడా అంచనాలకు మించి అద్భుతాలను చూపించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా 12వ వరల్డ్ గేమ్స్ సందర్భంగా ఇది మరోసారి కనిపించింది. చైనాలోని చెంగ్డూలో గురువారం మొదలైన ఈ పోటీలు ఆగస్టు 17 వరకు జరుగనున్నాయి. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తమ చరిత్ర, సంస్కృతి తెలిపే వివిధ ఘట్టాలను చైనా ప్రేక్షకుల ముందు ఉంచింది.
వీటిలో బాణాసంచాతో ప్రత్యేకంగా రూపొందించిన వెలుగులు విరజిమ్మే చెట్టు ఆకారాన్ని ప్రదర్శించడం హైలైట్‌గా నిలిచింది. శాంతి, స్నేహానికి ప్రతిరూపంగా చెంగ్డూలోని మ్యూజియంలో ఉన్న ‘ట్రీ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ చెట్టును ప్రదర్శించారు. ఈ 12వ వరల్డ్ గేమ్స్‌లో 116 దేశాలకు చెందిన 3,942 మంది అథ్లెట్లు 34 క్రీడాంశాల్లో పోటీ పడుతుండగా... ఆర్చరీలో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు.