టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకడు. భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలవడంలో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్‌తో పోరాడి తిరిగి మైదానంలో అడుగుపెట్టి పరుగులు రాబట్టిన ఘనుడు.
ఇక అన్ని ఫార్మాట్ల నుంచి చాలా ఏళ్ల క్రితమే వైదొలిగిన యువీ.. ఆ తర్వాత మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తాడు. పంజాబీ స్టార్లు.. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill), అభిషేక్ శర్మ (Abhishek Sharma)లకు చాన్నాళ్లుగా యువీ మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. ముఖ్యంగా అతడి గైడెన్స్‌లోనే అభిషేక్ టీ20 విధ్వంసకరవీరుడిగా రాటుదేలాడు.
అస్సలు పోలికలు లేవు
ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా PTIతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచింగ్ విషయంలో తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్‌తో తనకు అస్సలు పోలికలు లేవన్నాడు. మనకు నచ్చినది ఎదుటివాళ్లపై రుద్దడం కోచింగ్ కాదని.. ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను బట్టి తీర్చిదిద్దడమే అసలైన కోచింగ్ అంటూ పరోక్షంగా తండ్రికి కౌంటర్ ఇచ్చాడు.
యోగ్‌రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదు
ఈ మేరకు.. ‘‘నేను కచ్చితంగా యోగ్‌రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదు. వ్యక్తిగా, వ్యక్తిత్వం పరంగా ఆయనతో నాకు పోలిక లేదు. మేమిద్దరం భిన్న ధృవాలము. నా కోచింగ్ శైలి కూడా వేరుగా ఉంటుంది.
ఒక ఆటగాడికి కోచ్‌గా ఉన్నపుడు.. అతడి స్థానంలో ఉండి ఆలోచించాలి. అతడికి ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాలి. వారి గురించి పూర్తిగా తెలుసుకుని మార్గనిర్దేశనం చేయాలి.
అభిషేక్ శర్మకు చాలా ఏళ్లుగా మెంటార్‌గా ఉన్నాను. తద్వారా ఓ వ్యక్తికి ఎలా మార్గదర్శనం చేయాలో నేను పరిపూర్ణంగా నేర్చుకున్నా. ప్రతిభావంతులను ఎలా గుర్తించాలో తెలుసుకున్నా. కఠిన శ్రమకు ఓరుస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కి మేము అనుకున్న ఫలితాలు రాబడుతున్నాం.
అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడు
సహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడు. 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టు కెప్టెన్ గ్యారీ కిర్‌స్టెన్ నాకు ఈ మాట చెప్పాడు. ఇదే నేను ఫాలో అయ్యాను. నా శిష్యులకు కూడా ఇదే చెబుతున్నా. కోచ్, కెప్టెన్ స్వేచ్ఛను ఇస్తే ఆటగాడు అద్భుతాలు చేయగలడు. ఇప్పుడు అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడు’’ అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
కాగా అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే ఐసీసీ నంబర్‌వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగాడు. ఇదిలా ఉంటే.. యువీని చిన్ననాటి నుంచే క్రికెటర్‌గా తీర్చిదిద్దే క్రమంలో యోగ్‌రాజ్ సింగ్ చాలా కఠినంగా వ్యవహరించాడు.
ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు కూడా!.. ఒకానొక సందర్భంగా తన శిక్షణలో యువీ చచ్చిపోతాడంటూ అతడి తన తల్లి గొడవపెట్టినా పట్టించుకోలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువీ తన తండ్రి గురించి పైవిధంగా స్పందించడం గమనార్హం.
చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు


