2028 ఒలింపిక్స్‌.. పాక్‌ క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ | No Pakistan Cricket Team In 2028 Olympics, Claims Report | Sakshi
Sakshi News home page

2028 ఒలింపిక్స్‌.. పాక్‌ క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

Jul 31 2025 6:39 PM | Updated on Jul 31 2025 6:56 PM

No Pakistan Cricket Team In 2028 Olympics, Claims Report

128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ పునఃప్రవేశించనుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌తో జెంటిల్మెన్‌ గేమ్‌ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో దక్కింది. 

నాడు గ్రేట్‌ బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ జరగగా.. అందులో గ్రేట్‌ బ్రిటన్‌ ఫ్రాన్స్‌ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

కాగా, రాబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లపై ఐసీసీ తాజాగా ఓ కంక్లూజన్‌కు వచ్చినట్లు తెలుస్తుంది. రీజియ‌న్ల వారీగా టాప్ ర్యాంక్ జ‌ట్ల‌ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు స‌మాచారం. 

ఈ లెక్కన ఆసియా నుంచి భార‌త్‌, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి ద‌క్షిణాఫ్రికా, యూర‌ప్ నుంచి ఇంగ్లండ్, ఆతిథ్య దేశంగా అమెరికా క్వాలిఫై అయ్యే అవ‌కాశ‌ముంది. ఆరో జ‌ట్టు ఎంపికపై క్లారిటీ లేదు. ఇదే జరిగితే పాకిస్థాన్, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్ల ఒలింపిక్స్‌ కల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు లాస్‌ ఏంజెలెస్‌కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.

రాబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్‌ మ్యాచ్‌లు (సెమీఫైనల్స్‌ మరియు బ్రాంజ్‌, గోల్డ్‌ మెడల్స్‌ మ్యాచ్‌లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.

  • జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు లేవు.

  • మ్యాచ్‌ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement