
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ (IND vs PAK)ను ఉద్ధేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదని అన్నాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే వారంతా బరిలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని వేదికలపై పాక్‌తో మ్యాచ్‌లు బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
అయితే, ఆసియా క్రికెట్ మండలి (ACC), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే బహుళ దేశాలు పాల్గొనే టోర్నీల్లో మాత్రం పాక్‌తో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం టీమిండియాకు అనుమతినిచ్చింది.
షేక్‌హ్యాండ్ నిరాకరణ
ఈ నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్‌తో మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా దాయాదిపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు.. పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ నిరాకరించడం ద్వారా తమ నిరసనను బహిరంగంగానే తెలియజేసింది.
ఎవరికీ ఇష్టం లేదు.. కానీ బీసీసీఐ వల్లే..
అయితే, అసలు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాల్సిన అవసరమే లేదు కదా అంటూ కొందరు మాత్రం టీమిండియాను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి.. ‘ఆసియా కప్‌లో పాక్‌తో ఆడటం ఇష్టమేనా అడిగితే కచ్చితంగా లేదు’ అనే చెప్తారు.
కానీ బీసీసీఐ ముందుగా ఇందుకు అంగీకరించిన కారణంగా బలవంతంగానైనా వారు ఆడాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ సేన పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు వ్యక్తిగతంగా విముఖంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడికి కూడా పాక్‌తో మ్యాచ్ ఆడటం ఇష్టం లేదని కచ్చితంగా చెప్పగలను’’ అని రైనా స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.
పాక్‌తో మ్యాచ్ బహి ష్కరించిన ఇండియా
కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరల్డ్ చాంపియన్‌షిన్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో పాక్ చాంపియన్స్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఇండియా చాంపియన్స్ ఇందుకు తిరస్కరించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టీ20 లీగ్‌లో పాక్‌తో మ్యాచ్‌ను లీగ్ దశలోనే బహిష్కరించింది.
కానీ ఆ తర్వాత సెమీస్‌లో కూడా పాక్‌తో తలపడాల్సి రాగా.. అప్పుడు కూడా నిరాకరించి టోర్నీ నుంచే నిష్క్రమించింది. కాగా యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ జట్టులో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్లు ఉన్నారు.