
మహిళల వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ప్రకటించింది. వెటరన్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించనుండగా... నలుగురు కొత్త ప్లేయర్లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ బోర్డు 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.
సుజీ బేట్స్, లీ తహుహు, సోఫీ డివైన్ ఐదోసారి ప్రపంచకప్ బరిలోకి దిగనుండగా... మ్యాడీ గ్రీన్, మెలియా కెర్‌కు ఇది మూడోది. 8 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన కివీస్ జట్టు అటు అనుభవజ్ఞులు, ఇటు యువ ప్లేయర్లతో సమతూకంగా ఉందని న్యూజిలాండ్ కోచ్ బెన్ సాయర్ అన్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా వచ్చే నెల 1న డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ ఆడనుంది.
న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూకీ హాలిడే, బ్రీ ఇలింగ్, పాలీ ఇన్‌గ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్‌మేరీ మైర్, జార్జియా ప్లిమర్, లీ తహుహు.