నీరజ్‌ చోప్రా... ఎనిమిదేళ్ల తర్వాత | Neeraj Chopra to participate in Paris Diamond League | Sakshi
Sakshi News home page

నీరజ్‌ చోప్రా... ఎనిమిదేళ్ల తర్వాత

Jun 15 2025 1:21 AM | Updated on Jun 15 2025 1:21 AM

Neeraj Chopra to participate in Paris Diamond League

పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో పాల్గొననున్న భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌

పారిస్‌: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది రెండు టోర్నమెంట్‌లలో రెండో స్థానంలో నిలిచిన 27 ఏళ్ల నీరజ్‌... ఈ నెల 20 నుంచి జరగనున్న లీగ్‌లో అగ్ర స్థానం దక్కించుకోవాలని చూస్తున్నాడు. చివరిసారిగా 2017లో పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో పాల్గొన్న నీరజ్‌... మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇందులో పాల్గొంటున్నాడు. ఈ మేరకు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘రెండు ఒలింపిక్‌ పతకాల విజేత నీరజ్‌ చోప్రా, రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌తో పాటు ఇప్పటికే 90 మీటర్ల మార్క్‌ దాటిన మరో ఐదుగురు ప్రపంచ స్థాయి జావెలిన్‌ త్రోయర్లు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని నిర్వహకులు పేర్కొన్నారు. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఈ లీగ్‌కు దూరంగా ఉన్న నీరజ్‌ చోప్రా... ఈసారి సత్తాచాటాలని భావిస్తున్నాడు. 

ఈ లీగ్‌ అనంతరం చెక్‌ రిపబ్లిక్‌లో జరగనున్న గోల్డెన్‌ స్పైక్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో నీరజ్‌ పాల్గొననున్నాడు. ఆ తర్వాత భారత్‌లో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి జావెలిన్‌ త్రో పోటీల్లో నీరజ్‌ పాల్గొననున్నాడు. ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ పేరుతో వచ్చే నెల 5న బెంగళూరు వేదికగా జరగనున్న ఈ ఈవెంట్‌కు ప్రపంచ అథ్లెటిక్‌ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచి్చంది. ఇందులో అంతర్జాతీయ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్లు పాల్గొననున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement