అమ్ముడుపోని బౌలర్‌ విధ్వంసం! | Navdeep Saini Sends Finn Allen Middle Stump KKR Intra Squad Match | Sakshi
Sakshi News home page

IPL 2026: అమ్ముడుపోని బౌలర్‌ విధ్వంసం!

Mar 21 2026 6:24 PM | Updated on Mar 21 2026 6:34 PM

Navdeep Saini Sends Finn Allen Middle Stump KKR Intra Squad Match

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్‌ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్‌ విధ్వంసరకర బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్రాక్టీస్‌లో భాగంగా ​​కేకేఆర్‌ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్‌ నైట్స్‌, గోల్డెన్‌ నైట్స్‌గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడారు. గోల్డెన్‌ నైట్స్‌ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్‌ నైట్స్‌కు శుభారంభం లభించింది. ఫిన్‌ అలెన్‌ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్‌ సైనీ బౌలింగ్‌కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్‌ అలెన్‌ సిక్సర్‌గా మలిచాడు. 

అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్‌ వేయగా ఫిన్‌ అలెన్‌ వికెట్‌ నుంచి పక్కకు జరిగి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్‌ అలెన్‌ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్‌ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్పుల్‌ నైట్స్‌ 6 వికెట్ల తేడాతో గోల్డెన్‌ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్‌క్రిష్‌ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్‌ నైట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 

టిమ్‌ సీఫెర్ట్‌ (45), సార్థక్‌ రాజన్‌ (37), రింకూ సింగ్‌ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఫిన్‌ అలెన్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్‌ అలెన్‌ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కేకేఆర్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌, పంజాబ్‌, లక్నోతో ఆడనుంది.

చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement