
యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నిన్నటి దాకా టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఆ రికార్డును వసీం తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (సెప్టెంబర్ 1) జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదిన వసీం.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా అవతరించాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మను వెనక్కు నెట్టాడు. రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా 62 ఇన్నింగ్స్‌ల్లో 105 సిక్సర్లు బాదగా.. వసీం 54 ఇన్నింగ్స్‌ల్లోనే 110 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితా టాప్-4లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (65 ఇన్నింగ్స్‌ల్లో 86 సిక్సర్లు), ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (76 ఇన్నింగ్స్‌ల్లో 82 సిక్సర్లు) వసీం, రోహిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముహమ్మద్ వసీం మెరుపు అర్ద శతకంతో (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడినా యూఏఈని గెలిపించలేకపోయాడు. అతనికి వికెట్‌కీపర్ రాహుల్ చోప్రా (35 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సహకరించినా ప్రయోజనం లేకుండా పోయింది.
మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా రాణించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యం యూఏఈకి చాలా భారీగా పరిగణించబడింది. రషీద్ ఖాన్ (4-0-21-3), షరాఫుద్దీన్ అష్రఫ్ (4-0-24-3) చెలరేగడంతో 150 పరుగులకే పరిమితమై, 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
అంతకుముందు సెదీఖుల్లా అటల్ (40 బంతుల్లో 54), ఇబ్రహాం జద్రాన్ (40 బంతుల్లో 63), అజ్మతుల్లా (12 బంతుల్లో 20 నాటౌట్), కరీమ్ జనత్ (10 బంతుల్లో 23 నాటౌట్) రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
కాగా, ఆసియా కప్‌కు ముందు షార్జా వేదికగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్ వరుసగా రెండు విజయాలు (ఆఫ్ఘన్, యూఏఈ) సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్ తాజా తొలి విజయం నమోదు చేసింది. యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి బోణీ కోసం ఎదురుచూస్తుంది. ఇవాళ పాక్, ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తలపడనున్నాయి.