'11 ఏళ్లయినా తక్కువ అంచనా వేస్తున్నారు'

Mohammad Kaif Says Team India Dearly Miss Ravindra Jadeja T20 Series - Sakshi

కాన్‌బెర్రా : రవీంద్ర జడేజా గాయంతో దూరమవడం జట్టుకు లోటు కానుందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. 2009లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన జడేజా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టాప్‌ ఆల్‌రౌండర్‌ స్థాయికి చేరుకున్నాడని కైఫ్‌ చెప్పుకొచ్చాడు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో కైఫ్‌ మాట్లాడాడు.

'రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి 11 ఏళ్లయింది.. అయినా అతన్ని ఇప్పటికీ తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇన్నేళ్లుగా అతను ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.. తన బౌలింగ్‌తోనూ ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను చూసుకుంటే మంచి ఫామ్‌ కనబరుస్తూ పరుగులు సాధించాడు. మూడో వన్డేలో హార్థిక్‌తో కలిసి చేసిన 150 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని ఎవరు మరిచిపోరు. దీంతో జడేజా ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు జడేజా గాయంతో దూరమవడం పెద్ద లోటుగా మారనుంది. ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ సేవలను కోల్పోతే జట్టు ఇబ్బందులకు గురవ్వడం సహజమే. టీమిండియా అతని సేవలను మిస్‌ కానుంది.'అంటూ కైఫ్‌ తెలిపాడు. (చదవండి : కోహ్లికి మాత్రం రూల్స్‌ వర్తించవా?)

కాగా ఆసీస్‌తో జరిగిన మొదటి టీ20లో జడేజా 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 19వ ఓవర్లో మూడు బంతుల తర్వాత జడేజా   కండరాల నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. తర్వాతి ఓవర్‌ రెండో బంతికి స్టార్క్‌ వేసిన బంతి అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అయితే ఆ సమయంలో భారత ఫిజియో రాకపోగా, జడేజా బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఆ తర్వాత నొప్పితో ఇబ్బంది పడిన జడేజా ఫీల్డింగ్‌కు రాలేదు.

దీంతో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ కింద చహల్‌ను జడేజా స్థానంలో తీసుకువచ్చారు. చహల్‌ మూడు కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే జడేజా తలకు తగిలిన దెబ్బను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా టి20 సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేశామని బీసీసీఐ ప్రకటించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top